- డెడికేటెడ్ కమిషన్ ముందు అభ్యంతరం వ్యక్తం చేసిన సగర సంఘం
- ప్రభుత్వంలో అధికారులు కొన్ని కులాలకే పెద్ద పీట వేస్తున్నారు
- సగర కులానికి అన్యాయం చేస్తే సహించేది లేదు
- సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర
శేరిలింగంపల్లి, నవంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుల సర్వే ఫార్మేట్ బుక్ లెట్ లో వృత్తికులాలను పొందుపరచడంలో సగర కులాన్ని వృత్తి కులంగా పొందుపరచకపోవడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డెడికేటెడ్ కమిషన్ ముందు తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మంగళవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య భవన్ లో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ బూసని వెంకటేశ్వరరావు ను తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మోడల రవి సగర, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సంగిశెట్టి గంగాధర్ సగర లు కలిసి అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర విడుదల చేసిన పత్రిక ప్రకటనలో పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ‘డీ’ లో ఉన్న సగర కులాన్ని సామాజిక కోణంలో తక్కువ సంఖ్యగా చూపుతూ ప్రభుత్వాలు, పాలకులు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని బిసి కులాలను మాత్రమే వృత్తి కులాలుగా నిర్ధారిస్తూ సమగ్ర కుల సర్వే ఫార్మేట్ బుక్ లెట్ లో ముద్రించడం సబబు కాదని అన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుకు లోనైన నిర్మాణరంగం పై ఆధారపడి ఉప్పర పని కులవృత్తిగా కొనసాగుతున్న తమను ప్రభుత్వ అధికారులు నిర్ధారించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుల సర్వేలో సరియగు సంఖ్య నిర్ధారణ కాకపోతే దానికి ప్రభుత్వంలో ఉన్న అధికారులే బాధ్యత వహించాలని అన్నారు.
గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కులవృత్తులను గుర్తించి ఏర్పాటుచేసిన ఫెడరేషన్లు కొనసాగుతున్నాయని, ప్రభుత్వం ఒక వైపు అధికారికంగా కులవృత్తులను గుర్తించి ఫెడరేషన్లను కొనసాగిస్తున్న క్రమంలో మరోవైపు సమగ్ర కుల సర్వేలో మాత్రం సగర కులాన్ని వృత్తి కులంగా గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. భవిష్యత్తులో సగర కులాన్ని ఇదేవిధంగా గుర్తించకుండా అన్యాయం చేయడానికి చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వంలో పని చేస్తున్న కొంతమంది అధికారులు కూడా కొన్ని సామాజిక వర్గాలకే పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు.