నమస్తే శేరిలింగంపల్లి: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అహ్మద్ పాషా తెలిపిన వివరాల ప్రకారం చందానగర్ గోపాలరాజు కాంప్లెక్స్ లో నివాసముండే బండ్ల చంద్రమోహన్(46) స్థానికంగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం చంద్రమోహన్ మాధవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కూతురు సంతానం. అయితే గత ఎనిమిది నెలలుగా దంపతుల మధ్య చిన్నచిన్న గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే గతంలో చందానగర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించగా పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి ఇరువురికి నచ్చజెప్పి పంపించారు. కాగా గురువారం ఉదయం మాధవి ఎప్పటిలాగే తన ఆఫీసుకు వెళ్లగా ఇంట్లో చంద్రమోహన్, తన కూతురు, తల్లీ ఉన్నారు. ఐతే ఉదయం 11:15 గంటల ప్రాంతంలో చంద్రమోహన్ ఇంట్లోని ఫ్యానుకు పంచతో ఉరివేసుకున్నారు. తన భర్త జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు మాధవి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.