శేరిలింగంపల్లి, అక్టోబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): బొలెరో వాహనం ఢీకొనడంతో 65 ఏళ్ల వృద్ధుడు మృతి చెందిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పర్వత్‌నగర్ ఫిష్ మార్కెట్ వెనుక ఉన్న శ్రీ వెంకట రామాంజనేయ నర్సరీలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోల సూగురయ్య (65) నర్సరీలోని ఖాళీ ప్రదేశంలో మూత్ర విసర్జనకు వెళ్లి తిరిగి వస్తుండగా, నర్సరీకి చెందిన TS07UP0998 నంబర్ గల బొలెరో వాహనం రివర్స్ తీసుకుంటున్న సమయంలో అతన్ని ఢీకొట్టింది. వాహనం కొంతదూరం అతన్ని ఈడ్చుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సూగురయ్యను వెంటనే శ్రావణి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం సుమారు 2:10 గంటలకు మృతి చెందాడు. మృతుడి కుమారుడు కోల రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీహార్‌కు చెందిన నర్సరీ కార్మికుడు, డ్రైవర్ చోటు కుమార్ (20)తో పాటు నర్సరీ యజమాని మల్లికార్జున్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





