రోడ్ల మరమ్మత్తులు పూర్తి చేయాలని వినూత్న నిరసన
ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రవికుమార్ యాదవ్ లు ఆరోపించారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని విడియా కాలనీలో అసంపూర్తిగా అభివృద్ధి చేసిన అంతర్గత రహదారిపై గులాబీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా తాము పర్యటిస్తున్నామని, అన్ని ప్రాంతాలలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందంగా ఉన్నాయన్నారు. వీడియా కాలనీలో రోడ్ల మరమ్మత్తుల కోసం అధికారులు ఆరు నెలల క్రితం రోడ్లను తవ్వి పనులు పూర్తి చేయకుండా మధ్యలోనే వదలివేశారన్నారు. దీని ఫలితంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. స్థానికుల సమస్యల పట్ల ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ విశ్రమించబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇలియజ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.