- మాయమాటలతో ప్రజలను మోసగిస్తున్న ఇస్యూరెన్సు ఏజెంట్లు

నమస్తేశేరిలింగంపల్లి: ఇన్సూరెన్స్ పాలసీలు అనగానే చాలామంది ఎదో ఒక సందర్భంలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తాము లేకున్నా కుటుంబానికి ఆర్థికంగానైనా అండగా ఉంటుందని నమ్మి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటుంటారు. కొన్ని పేరుగాంచిన సంస్థల ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ సంస్థ నిబంధనలు అన్ని సరిపోలితేనే పాలసీలు జారీ చేసి అందుకు తగినట్లుగా సేవలందిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వినియోగదారులు ప్రీమియం చెల్లించే స్థితిలో ఉన్నప్పటికీ భీమా చేయించుకునే వ్యక్తుల అర్హతలు సంస్థ నిబంధనలకు లోబడి లేని పరిస్థితుల్లో లైఫ్ కవర్ పాలసీ జారీ చేసేందుకు నిరాకరించడం గమనార్హం. ఇలా ప్రజాదరణ కలిగిన సంస్థలు నిరాకరించే వినియోగదారులను, సామాన్య వ్యాపారులను టార్గెట్ చేస్తున్న కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు అరచేతిలో ఆకాశాన్ని చూపిస్తూ వినియోగదారులను నట్టేట ముంచుతున్నాయి. కేవలం డబ్బులు చెల్లిస్తే చాలు అంటూ ఎడాపెడా భీమాలు జారీ చేస్తూ వినియోగదారులకు సరైన సేవలు అందించకుండా మోసగిస్తున్నాయి.
సామాన్య ప్రజలు ఇదివరకు పేరు కూడా వినని కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు ఎజెంట్లను నియమించుకుని ఊరూరా తిప్పుతుంటాయి. ఈ ఏజెంట్లకు నెలవారీ టార్గెట్లు ఇచ్చి ప్రజల మీదికి వదిలేస్తాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారే వీరి లక్ష్యం. సదరు వ్యాపారులు ఖాళీగా ఉన్న సమయంలో ఈ సంస్థల ఏజెంట్లు తమ వాక్చాతుర్యంతో పాలసీలు తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటూ నమ్మించేస్తారు. ఇతర కంపెనీలకంటే తమ సంస్థ మాత్రమే ఉత్తమ సేవలు అందిస్తుందని మాయమాటలు చెప్తారు. వినియోగదారుల బలహీనతను ఆసరా చేసుకుని అర చేతిలో ఆకాశం చూపించి, ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా ఎదో ఒక పాలసీ కట్టించేస్తారు. దరఖాస్తు ఫారం లలో పూర్తి షరతులను వివరించకుండా, కేవలం అనుకూలంగా ఉన్న అంశాలను మాత్రమే వివరిస్తారు. తీరా డబ్బులు అందాక, పాలసీ దారుడికి సమస్య వచ్చినప్పుడే అసలు కథ మొదలవుతుంది. డబ్బులు కట్టించుకోవడమే తమ పని అని, తర్వాత ఏమైనా సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లలో సంప్రదించాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు ఏజెంట్లు. పాలసీ కట్టించినందుకు బాధ్యత వహించాలని అడిగితే మాత్రం అడ్డంగా వాదిస్తుంటారు. పాలసీ క్లెయిమ్ చేసుకునే సందర్భాల్లో లేనిపోని షరతులను చూపి వినియోగదారులకు మొండిచెయ్యి చూపించడం పరిపాటిగా మారిపోయింది. తీరా మోసపోయామని తెలుసుకుంటున్న వినియోగదారులు ఏమి చేయలేని స్థితిలో నిట్టూర్చుతున్నారు.
భీమా తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి..
- ఏజెంట్లు చెప్పిన విషయాలు వారి పాలసీ షరతులతో సరిపోలాయో లేదో ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలి.
- మీ చుట్టూ తిరుగుతూ హడావిడిగా పాలసీ తీసుకొమ్మని బలవంతం చేసే ఏజెంట్లను అస్సలు నమ్మవద్దు.
- ఏదైనా పాలసీ మీకు నచ్చినట్లయితే కొనుగోలు చేసే ముందు, పాలసీ గురించిన నిజానిజాలు ఒకటికి రెండు సార్లు బీమా సంస్థ నుంచి తెలుసుకునేందుకు ప్రయత్నిచండి.
- పాలసీ కొనుగోలుకు కొంత సమయాన్ని కేటాయించండి. మీరు కేటాయించే ఈ సమయం భవిష్యత్తులో మోసాలకు గురికాకుండా కాపాడుతుంది.
- దరఖాస్తు పత్రాలను స్వయంగా నింపడం మంచిది, ఖాళీ దరఖాస్తులు, చెక్కులపై సంతకాలు చేయవద్దు.
బీమా సంస్థ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నేరుగా ప్రీమియం చెల్లించడం ఉత్తమమైన పద్దతి. - నగదు రూపంలో ప్రీమియం చెల్లించేవారు బీమా సంస్థ బ్రాంచికి వెళ్లి చెల్లింపులు చేయాలి. ఒకవేళ మీరు బీమా సంస్థ ఏజెంట్‌కు ప్రీమియం కడుతుంటే, బీమా సంస్థను కాల్ ద్వారా సంప్రదించి ఏజెంట్ ఐడీ కార్డు పూర్తి వివరాలను ధృవీకరించుకోవాలి.
- భీమా సంస్థల గురించి ఇదివరకటి వినియోగదారులు ఆయా సంస్థల సామజిక మాధ్యమాలలో (facebook, twitter)ఇచ్చే రివ్యూలను పరిశీలించడం మంచిది.






