శేరిలింగంపల్లి, నవంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఇందులో భాగంగా మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) దక్షిణ విభాగం కమాండెంట్ విక్రమ్, CRPF ఇంజనీరింగ్ విభాగం అధికారి కృష్ణ ఉపాధ్యాయ, CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి నడిగడ్డ తండాలో పర్యటించారు.

ఈ సందర్భంగా కాలనీల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల నిర్మాణ పనులు, భూగర్భ మురుగునీటి పారుదల (UGD) పైప్లైన్ నిర్మాణం చేపట్టాల్సిన ప్రాంతాలను పరిశీలించారు. ముఖ్యంగా నడిగడ్డ తండా నుంచి HDFC బ్యాంక్ బొల్లారం రోడ్డు వరకు మురుగునీరు నిలిచిపోవడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీకాంత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. UGD పైప్లైన్ నిర్మాణ పనులకు అవసరమైన అనుమతులు మంజూరు చేస్తే వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని, తద్వారా మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు కాలనీలో పరిశుభ్రమైన, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని ఆయన వివరించారు.
ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీల్లో ఇప్పటికే అనేక మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. ఇంకా అసంపూర్తిగా ఉన్న రోడ్ల నిర్మాణం, UGD పనులను కూడా త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో నడిగడ్డ తండాలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, కాలనీల్లో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై CRPF దక్షిణ విభాగం అధికారులు సానుకూలంగా స్పందించినట్లు శ్రీకాంత్ తెలిపారు. ఈ పర్యటనలో CRPF సంబంధిత అధికారులు, CMC ఇంజనీరింగ్ విభాగం AE ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.





