శేరిలింగంపల్లి, అక్టోబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ డివిజన్ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు మరో ముందడుగు పడింది. సుభాష్ చంద్రబోస్ నగర్, హరిజన బస్తీ, మెగా హిల్స్, అయ్యప్ప సొసైటీ కాలనీల్లో మొత్తం రూ.1 కోటి 61 లక్షల 50 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ (యూజీడీ), తాగునీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. జలమండలి అధికారులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. కాలనీల్లో భూగర్భ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. స్థానిక ప్రజలు, కాలనీల అసోసియేషన్ల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని, ప్రత్యేక చొరవతో ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. డ్రైనేజీ పొంగిపొర్లడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

అత్యవసరంగా పనులు చేపట్టాల్సిన ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని గాంధీ వెల్లడించారు. ప్రతి కాలనీలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు అవసరమైన పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని, పనుల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. పనుల్లో జాప్యం జరగకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కాలనీల్లో మౌలిక వసతులను మెరుగుపరచి, ప్రజలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే తన లక్ష్యమని చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని గాంధీ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం నరేందర్, మేనేజర్లు సలోమి, విక్రమ్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






