జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం.. ప్రజాసేవే ధ్యేయం: దోస్తానా ఫౌండేషన్, TCEMA

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జర్నలిస్టుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం కృషి చేయడంతో పాటు ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి, సమాజ సేవలో భాగస్వాములు కావడమే దోస్తానా ఫౌండేషన్, TCEMA జర్నలిస్టుల బృందం ప్రధాన లక్ష్యమని దోస్తానా మ్యూచువల్ ట్రస్ట్ ఫౌండర్ అజాం హుస్సేన్, TCEMA అధ్యక్షుడు రహమత్ తెలిపారు. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ 9వ ఫేజ్‌లోని ప్రెస్ కార్యాలయంలో సూర్య ఉదయం తెలంగాణ ఎడిటర్ బాషా ఆధ్వర్యంలో దోస్తానా ఫౌండేషన్, TCEMA సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజాం హుస్సేన్ మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు అండగా నిలవడంతో పాటు ఐక్యత, మానవత్వం, సేవాభావాన్ని పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టనున్నట్లు చెప్పారు.

ఆపదలో ఉన్న జర్నలిస్టులు, వారి కుటుంబాలకు అవసరమైన సమయంలో సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న ఎవరైనా దోస్తానా ఫౌండేషన్‌లో సభ్యులుగా చేరవచ్చని తెలిపారు. TCEMA అధ్యక్షుడు రహమత్ మాట్లాడుతూ.. జర్నలిజం కేవలం వార్తలను ప్రజలకు చేరవేయడం మాత్రమే కాదని, సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు అవసరమైన వారికి సహాయం చేయడం కూడా జర్నలిస్టుల సామాజిక బాధ్యతలో భాగమన్నారు. జర్నలిస్టుల హక్కులు, భద్రత, న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి నిపుణుల సహకారం అందించేలా కృషి చేస్తామని తెలిపారు. సభ్యత్వ నమోదు, బాధ్యతల కేటాయింపు, కార్యక్రమాల నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటిస్తామని పేర్కొన్నారు. మన ఐక్యతే మన బలం.. మన సేవే మన లక్ష్యం.. ప్రజా సంక్షేమమే మన ధ్యేయం అనే నినాదంతో ముందుకు సాగుతామని అన్నారు.

సభ్యులకు గుర్తింపు కార్డులు అందించడంతో పాటు మైత్రి హాస్పిటల్, ఇరీస్ డయాగ్నస్టిక్స్‌లో ప్రత్యేక రాయితీలు కల్పించనున్నట్లు తెలిపారు. కూకట్‌పల్లి, పరిసర ప్రాంతాల్లో TCEMA, దోస్తానా ఫౌండేషన్ ఇన్‌చార్జిగా బాషాను నియమించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో దోస్తానా మ్యూచువల్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు సయ్యద్ తాజుద్దీన్, ఆసిఫ్, ముజీబ్, ఎజాజ్, నజీర్, జీఎల్‌ఎన్ రెడ్డి, హబీబ్, యాసిన్, తులసి రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఆర్కే చౌదరి, సీనియర్ విలేకరులు నూతనపాటి శ్రీను, నజీర్, నరసింహ, క్రాంతి కుమార్, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here