శేరిలింగంపల్లి, అక్టోబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): కాకతీయ హిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కూకట్పల్లి జోన్ సూపరింటెండింగ్ ఇంజనీర్, మాదాపూర్ డిప్యూటీ కమిషనర్‌తో కలిసి ఉదయం పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్.. రహదారి కనెక్టివిటీ, ప్రజా మౌలిక వసతుల మెరుగుదలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కాకతీయ హిల్స్ ప్రాంతంలో రహదారి కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మసీదు భూమి నుంచి కాకతీయ హిల్స్ రోడ్ నంబర్ 11, అలాగే రోడ్ నంబర్ 3, 7 వైపు అనుసంధానించే లింక్ రోడ్డును అభివృద్ధి చేయాలని సూచించారు.

సిగ్నల్ నుంచి సున్నం చెరువు వరకు ఉన్న మార్గాన్ని గుర్తించి, అక్కడి ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. వాహనాల పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు ఆ మార్గాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. సున్నం చెరువు కల్వర్ట్ నుంచి గోదావరి కట్స్, పార్వతీ నగర్ జంక్షన్ వరకు బీటీ రోడ్డు రీకార్పెటింగ్ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే అవసరమైన రహదారి విస్తరణ పూర్తిచేసిన అనంతరం హైటెక్ సిటీ ఫ్లైఓవర్ నుంచి RRR బార్ వరకు ఫుట్‌పాత్ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. కాకతీయ హిల్స్ రోడ్ నంబర్ 11 వద్ద వక్ఫ్ బోర్డు భూమికి ఆనుకుని ఉన్న రహదారి వెంబడి ప్రీకాస్ట్ గోడలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశించారు.

గుర్తించిన అన్ని అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని, అమలులో ఎదురయ్యే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.





