మాదాపూర్ లక్కీ రెస్టారెంట్ వివాదంలో కీలక డాక్యుమెంట్లు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్‌లోని లక్కీ మల్టీ కుజిన్ రెస్టారెంట్ వివాదంలో కీలక డాక్యుమెంట్లు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారం దాడికి సంబంధించినది కాదని, యజమాని–అద్దెదారు మధ్య నెలకొన్న లీజు, అద్దె బకాయిల వివాదమని యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పిల్లర్ నంబర్ 1723 వద్ద ఉన్న స్థలాన్ని రవి, హరి తదితరులు మహమ్మద్ మన్సూర్‌కు లీజుకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రూ.100 స్టాంప్ పేపర్‌పై లీజు అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఒప్పంద గడువు ముగిసి చాలా కాలం గడిచినా అద్దె చెల్లించకుండా, స్థలాన్ని ఖాళీ చేయకుండా కొనసాగుతున్నారని యజమానులు ఆరోపిస్తున్నారు.

ఈ వివాదానికి సంబంధించి లీజు అగ్రిమెంట్, అద్దె బకాయిల వివరాలు, గతంలో చెల్లించిన చెక్కుల ఫొటోలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు జారీ చేసిన నోటీసులు, FSSAI లైసెన్స్ సస్పెన్షన్ ఉత్తర్వులు తదితర పత్రాలను పోలీసులకు సమర్పించినట్లు యజమానులు వెల్లడించారు. తమ స్థలంలో రోడ్డు మరమ్మత్తుల సందర్భంగా జరిగిన చిన్న ఘర్షణను అడ్డం పెట్టుకుని మన్సూర్ వివాదాన్ని పెద్దది చేస్తున్నారని యజమానులు ఆరోపించారు. పలుమార్లు అద్దె చెల్లించి స్థలాన్ని ఖాళీ చేయాలని కోరినా స్పందించలేదని తెలిపారు. ఇదిలా ఉండగా, పోలీసులు విడుదల చేసిన లేఖ‌లో కూడా ఈ వ్యవహారం యజమాని–అద్దెదారుల మధ్య అద్దె వివాదంగా పేర్కొన్నట్లు యజమానులు చెబుతున్నారు.

మరోవైపు, అక్టోబర్ 3 అర్ధరాత్రి పెట్రోలింగ్ విధుల్లో ఉన్న మాదాపూర్ పోలీసులను మన్సూర్ తన భార్య, అనుచరులతో కలిసి అడ్డుకున్నారని, రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. లీజు ఒప్పందం, అద్దె బకాయిలు, ఫుడ్ సేఫ్టీ సంబంధిత పత్రాలు వంటి ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. అయితే, వివాదంలోని ఆరోపణలు సంబంధిత పక్షాల వాదనలేనని, తుది వాస్తవాలు అధికారిక దర్యాప్తు లేదా న్యాయపరమైన నిర్ణయాల ద్వారా తేలాల్సి ఉంటుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here