శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీ నగర్ కాలనీలో వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్‌లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. భక్తితో పాటు ప్రకృతి పట్ల బాధ్యత కలిగి ఉండడం ప్రతి ఒక్కరి ధర్మమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాల వల్ల చెరువులు కలుషితమయ్యే అవకాశం ఉందని గాంధీ తెలిపారు. చెరువుల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, జలవనరులను కాలుష్యం నుంచి కాపాడేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. వినాయక ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పండుగ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు వినాయక మండపాల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు, అధికారులు సమన్వయంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.






