మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): బ్యాంకులో ఫైనాన్స్ మొత్తం చెల్లించి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వృద్ధుడు శవమై కనిపించాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మియాపూర్లోని జనప్రియ నగర్ ఫేజ్-2లో నివాసం ఉండే కిషోర్ కాకర తండ్రి రామకృష్ణ (55) గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో మియాపూర్లోని ఆంధ్రా బ్యాంకులో ఫైనాన్స్ మొత్తాన్ని చెల్లించేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. అనంతరం తిరిగి రాలేదు. దీంతో అతని ఆచూకీ కోసం గాలించినా తెలియకపోవడంతో కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా కూకట్పల్లి పరిధిలోని కైతలాపూర్ జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు వద్ద ఓ వ్యక్తి మృతదేహం పడి ఉందన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు వెళ్లి పరిశీలించి చూశారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి వివరాలను వారు తెలుసుకోగా అతను మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన రామకృష్ణ అని వెల్లడైంది. అతని శరీరంపై రక్తంతో కూడిన గాయాలు ఉన్నాయి. దీంతో కూకట్పల్లి పోలీసులు మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని రామకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా రామకృష్ణ మృతికి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.