శేరిలింగంపల్లి, నవంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఛట్ పూజా వేడుకలు మియాపూర్ డివిజన్ పరిధిలోని గుర్నాధం చెరువు కట్టపై ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై, సీనియర్ నాయకుడు బండారు మోహన్ ముదిరాజ్, మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఖాజాతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఉదయించే సూర్యుడితో పాటు అస్తమించే సూర్యుడిని సైతం పూజించే విశిష్టమైన పండుగ ఛట్ పూజ అని పేర్కొన్నారు. కార్తీక మాసంలోని శుక్లపక్ష షష్ఠి రోజున జరుపుకునే ఈ పండుగను సూర్య షష్ఠి అని కూడా పిలుస్తారని తెలిపారు. సూర్య భగవానుడు, ఛఠీ మాతకు అంకితం చేసిన ఈ పవిత్రమైన పండుగలో భాగంగా భక్తులు నాలుగు రోజులపాటు నియమనిష్ఠలతో ఉపవాస దీక్షలు, పవిత్ర ఆచారాలు పాటిస్తారని వివరించారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో పెద్ద సంఖ్యలో భక్తులు నదులు, చెరువుల తీరాలకు చేరుకుని అస్తమించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ఈ పండుగలో ప్రత్యేకత అని తెలిపారు. ఛట్ పూజ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే గొప్ప ఆధ్యాత్మిక పండుగ అని, సూర్య భగవానుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ ఛట్ పూజా సమితి సభ్యులు హర్వింధర్, నాగేంద్రరావు, డి.కె. రావు, దేవనాథ్, సునీల్ గుప్తా, గోపీనాథ్ గుప్తా, పలువురు పార్టీ కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.





