శేరిలింగంపల్లి అభివృద్ధిపై ఆరెకపూడి గాంధీ సమీక్ష

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధిపై పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ జలమండలి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివేకానంద నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జలమండలి డైరెక్టర్ (ఆపరేషన్స్) రాజశేఖర్, సీజీఎం శ్రీనివాస్ రెడ్డి, జీఎం కృష్ణ, డీజీఎం నారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో తాగునీటి సరఫరా వ్యవస్థ, మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్వహణ, పనితీరుపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేలా జలమండలి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ కాలనీల ప్రజల నుంచి అందిన వినతిపత్రాలను పరిశీలించి, అత్యవసర సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుపై స్పందిస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీ పరిష్కారానికి కృషి చేయాలని స్పష్టం చేశారు. అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

నియోజకవర్గ ప్రజలకు నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందించాలని గాంధీ అధికారులకు సూచించారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా చూడటంతో పాటు, తాగునీరు కలుషితం కాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సమగ్ర, సమతుల్య అభివృద్ధిలో భాగంగా ప్రతి డివిజన్‌లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కాలనీల్లో అవసరమైన చోట కొత్త యూజీడీ (UGD) పైప్‌లైన్లు, మంచినీటి పైప్‌లైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి పనులు త్వరితగతిన చేపట్టాలని తెలిపారు.

అత్యవసర పనులను గుర్తించి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, ఇప్పటికే కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించి, అసంపూర్తిగా ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. కాలనీల్లో మురుగునీరు పొంగిపొర్లకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని గాంధీ సూచించారు. డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించి, సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించాలని తెలిపారు. దెబ్బతిన్న, అవసరానికి సరిపోని పైప్‌లైన్లను మార్చాలని, అవసరమైన చోట కొత్త పైప్‌లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన యూజీడీ, మంచినీటి పైప్‌లైన్ పనులకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యవసర పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రాధాన్యంగా భావించి అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here