శేరిలింగంపల్లి, నవంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 32 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో సీఎంసీ కమిషనర్ సృజన వివిధ శాఖల అధిపతులతో కలిసి పాల్గొని ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల్లో టౌన్ ప్లానింగ్ శాఖకు సంబంధించి అత్యధికంగా 26 ఫిర్యాదులు అందగా, ఇంజినీరింగ్ శాఖకు 3, శానిటేషన్ శాఖకు 2, ఎలక్ట్రికల్ శాఖకు ఒక ఫిర్యాదు అందింది.

ప్రతి ఫిర్యాదును ప్రత్యేక గ్రీవెన్స్ ఐడీ, ట్రాకింగ్ లింక్‌తో నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదుల స్థితిగతులను, పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ సంబంధిత శాఖల అధికారులతో ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టాలని, నిర్దేశించిన గడువులోగా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలపై తక్షణమే స్పందిస్తూ సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను అమలు చేయాలని అధికారులకు సూచించారు.





