నమస్తే శేరిలింగంపల్లి: వారిద్దరికి ఇటీవల నిశ్చితార్ధం జరిగింది. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కాల్సి ఉంది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చిన ఆ జంట రోడ్డు ప్రమాదానికి గురైంది. ద్విచక్ర వాహనంపై వెనకాల కూర్చున్న యువతి మృతిచెందగా, బైక్ నడుపుతున్న యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకున్న సంఘటన స్థానికులను కలచి వేసింది. ఇన్ స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం…
సైనిక్ పురిలో నివాసం ఉండే టి.అజయ్, జెన్నిఫర్ మరియ డిక్రూజ్ లు మాదాపూర్ ఐటీ జోన్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఇటీవల వారిరువురికి పెళ్లి సంబంధం కుదిరింది. పెద్దల సమక్షంలో నిశ్చితార్ధం జరిగగా త్వరలో పెళ్లి కావలసి ఉంది. ఐతే అజయ్, జెన్నిఫర్ లు గచ్చిబౌలిలోని బంధువుల ఇంట్లో శనివారం శుభ కార్యానికి వచ్చారు. ఆదివారం ఉదయం తిరిగు ప్రయాణం అయ్యారు. రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనం (TS08HA8739)పై కొత్తగూడ వైపు నుంచి సైబర్ టవర్ వైపు వస్తున్న క్రమంలో సీఐఐ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో బైక్ ఆపారు. వెనక వైపు నుంచి వేగంగా వచ్చిన మహీంద్ర కంపెనీకి చెందిన XUV-500 (TS08FU5618) కారు రాయల్ ఎన్ ఫిల్డ్ ను ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న ఇద్దరు కింద పడిపోయారు.
వెనక కూర్చున్న జెన్నిఫర్ తలకు బలమైన గాయాలు అవ్వడంతో దగ్గరలోని మెడికవర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. బైక్ నడుపుతున్న అజయ్ ఎడమ చేయి, ఎడమ కాలు, వెన్నముకకు గాయాలవ్వగా చికిత్స అందిస్తున్నారు. మృతురాలి తండ్రి జాన్ సిరిల్ డిక్రూజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ అక్కడినుండి పరారయ్యాడు.