శేరిలింగంపల్లి, నవంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి నుంచి అందే ఫిర్యాదులపై సత్వరమే స్పందించి పరిష్కార చర్యలు చేపడతామని పేర్కొన్నారు. సర్కిల్ పరిధిలో రోడ్లు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, చెత్త సేకరణ తదితర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను ప్రజలు తన దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు. ఇందుకోసం MyCURE యాప్, X (ట్విట్టర్), సర్కిల్ కార్యాలయంలోని ఇన్వార్డ్ విభాగం ద్వారా ఫిర్యాదులు సమర్పించవచ్చని సూచించారు.

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతి సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాగే ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఈ నెల చివరి నుంచి ప్రతిరోజూ ఒక వార్డులో పర్యటించే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనల్లో స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తామని చెప్పారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. మరోవైపు అనుమతులు లేకుండా చేపట్టే నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాలు, రహదారులు, ప్రజా స్థలాల ఆక్రమణలపై అందే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తామని, ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీ అభివృద్ధికి కృషి చేస్తామని ఆమె తెలిపారు.





