శేరిలింగంపల్లి, నవంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): గుల్మోహర్ పార్క్ పరిధిలోని నేతాజీనగర్‌లో శ్రీ సాయి బృందావన క్షేత్రం అభివృద్ధిలో భాగంగా పునర్నిర్మాణ పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామివారి దివ్య ఆశీస్సులతో, శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సహాయ సహకారాలతో, వేద పండితుడు రాఘవేంద్ర శాస్త్రి సమక్షంలో ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువజన నాయకుడు రాగం అనిరుధ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య పూజా కార్యక్రమాలు కన్నుల పండువగా సాగాయి.

ఈ సందర్భంగా రాగం అనిరుధ్ యాదవ్ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చైతన్యానికి, భక్తిభావానికి నిలయాలైన దేవాలయాల అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. శ్రీ సాయి బృందావన క్షేత్రం పునర్నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు మరింత విస్తృతంగా ఆధ్యాత్మిక సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ భక్తుల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాల కోసం ఆధ్యాత్మిక, దైవచింతన కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. భక్తులందరూ ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములై క్షేత్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, నేతాజీనగర్ కాలనీ అధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్, సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, బాపునగర్ హనుమాన్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్ కుమార్, శ్రీకాంత్ దేవులపల్లి, నర్సింహా, ఎంగయ్య గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ, రాయుడు, గణేష్, జైరాజ్ సింగ్, రేణు, సాయి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.





