తమ్మిడికుంట చెరువుకు పునర్జీవం.. 12 ఎకరాల నుంచి 30.5 ఎకరాలకు విస్తరణ.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఖానామెట్‌లోని తమ్మిడికుంట చెరువుకు మహర్దశ పట్టింది. ఆక్రమణలు, పూడిక, చెత్తాచెదారంతో కనుమరుగయ్యే స్థితికి చేరిన చెరువు హైడ్రా (HYDRAA) ఆధ్వర్యంలో పునరుద్ధరణ, అభివృద్ధి పనులు పూర్తిచేసుకుని సరికొత్త రూపును సంతరించుకుంది. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఈ చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, ప్రభుత్వ శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనిల్ యాదవ్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నవీన్ యాదవ్, తోట లక్ష్మీకాంతరావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్, కలెక్టర్ నారాయణ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, CMC కమిషనర్ సృజన తదితరులు పాల్గొన్నారు. PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ, తన తరఫున, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. చెరువు ఆక్రమణలను తొలగించి, పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. కబ్జాలు, అక్రమ నిర్మాణాలను తొలగించి, చెరువు విస్తీర్ణాన్ని పరిరక్షించడంతోపాటు నాలాల పునరుద్ధరణ, సుందరీకరణ పనులు పూర్తి చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఒకప్పుడు 12 ఎకరాలకే పరిమితమైన తమ్మిడికుంట చెరువు ప్రస్తుతం 30.5 ఎకరాలకు విస్తరించిందని తెలిపారు. హైడ్రా ఆధ్వర్యంలో సుమారు 35 వేల లారీల వ్యర్థాలు, పూడికను తొలగించడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యాన్ని 46 మిలియన్ లీటర్ల నుంచి 375 మిలియన్ లీటర్లకు పెంచినట్లు పేర్కొన్నారు. చెరువు చుట్టూ పచ్చదనం, ఉద్యానవనాలు, వాకింగ్ ట్రాక్‌లు, విద్యుత్ దీపాలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం జరిగిందన్నారు. కాంక్రీట్ నిర్మాణాల మధ్య గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా చెరువును సుందరంగా తీర్చిదిద్దడం సంతోషకరమని తెలిపారు.

తన సొంత నిధులతో పలు చెరువుల సుందరీకరణ పనులు చేపట్టినట్లు గాంధీ తెలిపారు. గంగారం, పటేల్ చెరువుల్లో గుర్రపుడెక్క తొలగింపు పనులు చేపట్టినట్లు చెప్పారు. గంగారం, పటేల్ చెరువులతో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మొత్తం 64 చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు వెల్లడించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్యం, ప్రశాంతమైన వాతావరణం అందించడమే లక్ష్యమని, ఆరోగ్య శేరిలింగంపల్లి ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపు సమయంలో హైడ్రాపై కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ, నేడు అదే చెరువులు అభివృద్ధి చెంది ప్రజలకు అందుబాటులోకి రావడంతో హైడ్రా పనితీరును ప్రజలు ప్రశంసిస్తున్నారని గాంధీ పేర్కొన్నారు. హైడ్రా సేవలు అభినందనీయమని, కమిషనర్ రంగనాథ్ ప్రత్యేక చొరవను అభినందిస్తున్నట్లు తెలిపారు.

చెరువుల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, భవిష్యత్ తరాలకు జలవనరులను అందించేందుకు ప్రజలంతా చెరువుల సంరక్షణలో భాగస్వాములు కావాలని ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here