శేరిలింగంపల్లి, నవంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల అపర్ణ సరోవర్ గ్రాండే క్లబ్‌హౌస్‌లో బుధవారం శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. MPH హాల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ పూజా కార్యక్రమంలో అయ్యప్ప స్వాములకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అందరి సంక్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం స్వామివారి ఆశీస్సులు కోరుతూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మధ్యాహ్నం 1 గంట నుంచి భిక్ష, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అన్నదాన ప్రభువుగా జి. ఆదిశేష రెడ్డి, పూజా ఉపయకర్తగా ఎం. గంగాధర్, గురుస్వామిగా పాపినేని శ్రీకాంత్ వ్యవహరించారు. కన్నె స్వాములుగా మాణికంఠ, అభిరామ్ కవిదిదేవి, రాధాకృష్ణ కవిదిదేవి (ఆర్కే), కేవీ కృష్ణారావు, కే. ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. కో-ఆర్డినేటర్లుగా వాసు స్వామి, జ్ఞానేశ్వర్ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ పడిపూజ మహోత్సవానికి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములకు పూలమాలలు వేసి, అభిషేకంలో పాల్గొని, హారతి సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ.. అయ్యప్ప స్వాములకు సేవ చేసుకునే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. మహా పాదయాత్ర చేపడుతున్న స్వాములందరూ ఎలాంటి ఆటంకాలు లేకుండా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.





