అయ్యప్ప సొసైటీలో అనుమతులు లేకుండానే ఏడంతస్తుల భవనాలు.. అధికారుల తీరుపై వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆగ్రహం

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైటెక్ సిటీకి సమీపంలోని అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలంగాణ రక్షణ సేన (TRS) గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆరోపించారు. అయ్యప్ప సొసైటీలో కొందరు బిల్డర్లు కనీస నిర్మాణ అనుమతులు తీసుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఏడంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. భవన నిర్మాణానికి అవసరమైన సెట్‌బ్యాక్‌లు, జీహెచ్ఎంసీ ఫీజులు, ఫైర్ సేఫ్టీ అనుమతులు వంటి నిబంధనలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్థల విస్తీర్ణంతో సంబంధం లేకుండా 100 గజాల స్థలంలోనూ ఏడంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు.

ఇటీవల అంజయ్య నగర్‌లో 80 గజాల స్థలంలో నిర్మించిన ఏడంతస్తుల భవనం కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనను ఆయన గుర్తుచేశారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినా నిర్మాణదారులు నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అక్రమ నిర్మాణాలు కొనసాగించడం ఆందోళనకరమన్నారు. అయ్యప్ప సొసైటీ మీదుగా నిత్యం రాకపోకలు సాగించే ఉన్నతాధికారులకు ఈ అక్రమ నిర్మాణాలు కనిపిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సైబరాబాద్ కమిషనర్ సృజనతో పాటు సంబంధిత అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని నిలదీశారు. అయ్యప్ప సొసైటీలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి సంబంధించిన గురుకుల్ ట్రస్ట్ భూములను పరిరక్షించాలని వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. నిర్మాణ అనుమతులు, భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here