శేరిలింగంపల్లి, నవంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. పవన్ కుమార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ విభాగం ఆచార్యుడు తాళ్ల సుమాలిని మాట్లాడుతూ.. దేశంలో గుణాత్మక విద్యకు మార్గదర్శిగా నిలిచి, విద్యాభివృద్ధికి బాటలు వేసిన మహనీయుడు అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. స్వాతంత్ర్య పోరాటంలో పదేళ్లపాటు కారాగార శిక్ష అనుభవించిన ఆయన.. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారని గుర్తుచేశారు. పండితుడు, కవి, సంపాదకుడు, రాజనీతిజ్ఞుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారని, అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారని వివరించారు.

స్వాతంత్ర్యం అనంతరం వరుసగా 11 ఏళ్లపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆజాద్.. దేశ విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. ప్రాథమిక, ఉన్నత, సెకండరీ విద్యాభివృద్ధికి ప్రత్యేక కమిషన్ల ఏర్పాటుతోపాటు యూజీసీ, ఏఐసీటీఈ, సీఎస్ఐఆర్, ఐసీసీఆర్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల స్థాపనలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఖరగ్‌పూర్‌లో తొలి ఐఐటీ ఏర్పాటుతో పాటు సంగీతం, సాహిత్యం, లలితకళల అభివృద్ధికి వివిధ అకాడమీలను ఏర్పాటు చేశారని వివరించారు. 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని, ముఖ్యంగా బాలికలు విద్యకు దూరం కాకూడదని ఆయన ప్రత్యేకంగా కృషి చేశారని తెలిపారు. ఆజాద్ సేవలకు గుర్తింపుగా 1992లో భారత ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రదానం చేసిందని, ఆయన జన్మదినమైన నవంబర్ 11ను 2008 నుంచి జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
విద్య ద్వారా జ్ఞానం, ధైర్యం, సంస్కారం అలవడటమే కాకుండా ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, సామాజిక స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధి మెరుగుపడతాయని ఆచార్య సుమాలిని అన్నారు. పేదరిక నిర్మూలన, సమాజ శ్రేయస్సు, దేశాభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
ప్రస్తుత కాలంలో విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అంతర్జాలం అందుబాటులోకి రావడంతో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిందని పేర్కొన్నారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో ఇతర విద్యార్థులతో పోటీపడేలా కృషి, పట్టుదల, ఏకాగ్రతతో కూడిన నాణ్యమైన విద్యను అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు. అంతర్జాలాన్ని అవసరమైన మేరకే వినియోగించుకోవాలని, దానివల్ల విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని హితవు పలికారు.
విద్యార్థులు ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాల వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, పౌష్టికాహారం తీసుకుంటూ నిత్యం వ్యాయామం, ధ్యానం చేయాలని సూచించారు. భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని, చక్కని చేతిరాతపై దృష్టి సారించాలని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు కృషి చేస్తూ దేశాభివృద్ధికి తోడ్పడడమే అబుల్ కలాం ఆజాద్‌కు మనం అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులతో పాటు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు శివరామకృష్ణ, ఉపాధ్యాయులు రామేశ్వరరెడ్డి, ప్రభాస్ కుమార్, మధు, జాఫర్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





