శేరిలింగంపల్లి, నవంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సాంఘిక సంక్షేమ శాఖ మాజీ చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ జ్ఞాపకార్థం నిర్వహించిన అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవంలో భాగంగా శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన సమారాధనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. రాగం సుజాత యాదవ్ ఆశీస్సులతో, ఆమె ఆశయాలు, ఆదర్శాలను కొనసాగిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆమె జీవితాంతం పేదలకు, ఆపదలో ఉన్నవారికి సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేశారని గుర్తుచేశారు. ఆమె జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అయ్యప్ప భక్తులు, స్థానిక ప్రజలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






