శేరిలింగంపల్లి, నవంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): మహిళలు, చిన్నారుల రక్షణకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజనతో కలిసి పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. బాధిత మహిళలు, చిన్నారులకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు బాధితులకు అండగా నిలుస్తూ, వారికి న్యాయం జరిగేలా పోలీసు శాఖ అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.

ముఖ్యంగా మైనర్ బాలికలు సాధారణ పోలీస్ స్టేషన్లు లేదా బహిరంగ కోర్టు ప్రాంగణాలకు వెళ్లినప్పుడు భయాందోళనలతో తమకు జరిగిన విషయాలను చెప్పలేకపోతారని గాంధీ పేర్కొన్నారు. అలాంటి బాధితుల కోసం భరోసా కేంద్రాల్లో ప్రత్యేక నిపుణులతో కౌన్సెలింగ్, వైద్య పరీక్షలు, న్యాయ సహాయం వంటి సేవలను ఒకే ప్రాంగణంలో అందించడం ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. బాధితులకు మానసిక ధైర్యాన్ని కల్పిస్తూ, వారి జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపేందుకు ఈ కేంద్రాలు తోడ్పడతాయని అన్నారు. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. దాదాపు పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ కేంద్రాలు తెలంగాణ పోలీసు శాఖకు గర్వకారణమని అన్నారు.
అత్యాచార బాధితులు, ముఖ్యంగా మైనర్ బాలికలు సాధారణ పోలీస్ స్టేషన్లు, బహిరంగ కోర్టు ప్రాంగణాల్లో తమకు జరిగిన ఘటనలను వివరించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటారని డీజీపీ తెలిపారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని భరోసా కేంద్రాల్లో ప్రత్యేక నిపుణుల ద్వారా కౌన్సెలింగ్, వైద్య పరీక్షలు, న్యాయ సహాయం వంటి అన్ని సేవలను ఒకే భవనంలో అందిస్తున్నట్లు వివరించారు. బాధితులకు మొదట మానసిక ధైర్యాన్ని కల్పించి, స్నేహపూర్వక వాతావరణంలో వివరాలు సేకరించడం ద్వారా నేరస్థులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేయవచ్చని తెలిపారు. హైదరాబాద్లోని భరోసా కేంద్రంలో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు కూడా ఒకే ప్రాంగణంలో పనిచేస్తుండటంతో విచారణ ప్రక్రియ వేగవంతమవుతోందని వివరించారు. నేరాలకు గురైన మహిళలు, చిన్నారులకు అండగా నిలవడంలో భరోసా కేంద్రాల పాత్ర కీలకమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.





