శేరిలింగంపల్లి, నవంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): వెంకటేశ్వర నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు మరో ముందడుగు పడింది. కాలనీలో భూగర్భ డ్రైనేజీ (UGD), మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు రూ.18.70 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. జలమండలి అధికారులతో కలిసి, మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. కాలనీల్లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూగర్భ డ్రైనేజీ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రజల నుంచి అందిన వినతులను పరిగణనలోకి తీసుకుని, ప్రత్యేక చొరవతో ప్రగతి నగర్‌లో UGD, మంచినీటి పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా తరచూ డ్రైనేజీ పొంగిపొర్లుతూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ పనులు చేపడతామని వెల్లడించారు. అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించి, ప్రథమ ప్రాధాన్యతతో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు ED సంతోష్ రెడ్డి, GM హరిశంకర్, DGM నరేందర్, మేనేజర్ నరేందర్‌తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.





