ఈసీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలి: ఎంసీపీఐ(యూ)

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజాస్వామ్యం, ఓటు హక్కు పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలకు ఎంసీపీఐ(యూ) కేంద్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ప్రజా ఉద్యమాల్లో పార్టీ శ్రేణులు భాగస్వాములై ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర కమిటీ సమావేశం అనంతరం మద్ది కాయల అశోక్‌ ఓంకార్‌ పిలుపునిచ్చారు. కేరళలోని అలువా నగరంలో అక్టోబర్‌ 2, 3, 4 తేదీల్లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఈకే మురళి అధ్యక్షతన ఎంసీపీఐ(యూ) కేంద్ర కమిటీ సమావేశాలు జరిగాయి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యలపై అశోక్‌ ఓంకార్‌ నివేదికను ప్రవేశపెట్టగా, కేంద్ర కమిటీ చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది.

ప్రజాస్వామ్య, ఓటు హక్కు పరిరక్షణ ఉద్యమాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని అశోక్‌ ఓంకార్‌ ఆరోపించారు. కనీసం శాంతియుత నిరసనలకు కూడా అనుమతులు నిరాకరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తోందని విమర్శించారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థను దెబ్బతీసే విధంగా పాలన కొనసాగుతోందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్యలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. పార్లమెంటు ఉభయ సభల్లో కీలక అంశాలపై చర్చల సమయంలో ప్రధానమంత్రి, హోంమంత్రి వంటి ముఖ్యులు గైర్హాజరవుతున్నారని, ప్రతిపక్ష పార్టీలను చీల్చడం, ఫిరాయింపులను ప్రోత్సహించడం వంటి చర్యలతో ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు.

పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని ఎంసీపీఐ(యూ) కేంద్ర కమిటీ పేర్కొంది. దేశవ్యాప్తంగా కాగితపు బ్యాలెట్‌ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలనే డిమాండ్‌ పెరుగుతోందని తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ వ్యవహరిస్తున్న తీరు పక్షపాతంగా ఉందని అశోక్‌ ఓంకార్‌ ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌లోని ఇతర కమిషనర్లు బహిరంగంగా అసమ్మతి వ్యక్తం చేయడం సంస్థాగత సమస్యల తీవ్రతను తెలియజేస్తోందని అన్నారు. కేంద్ర కమిటీ ప్రధాన డిమాండ్ల‌ను ఈ సంద‌ర్భంగా వెల్లడించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తక్షణమే తొలగించాలని, వివక్షపూరిత ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బేషరతుగా నిలిపివేయాల‌ని, సవరణ ప్రక్రియలో ఏకపక్షంగా తొలగించిన చట్టబద్ధమైన ఓటర్లందరినీ తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాల‌ని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలానికి సంబంధించిన 2023 చట్టాన్ని రద్దు చేసి, స్వతంత్ర నియామక ప్యానెల్‌ ఏర్పాటుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాల‌ని, అన్ని ఎన్నికల్లో ఈవీఎంలను రద్దు చేసి, కాగితపు బ్యాలెట్‌ విధానాన్ని పునరుద్ధరించాల‌ని అన్నారు.

శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలపై నిర్బంధం, అక్రమ అరెస్టులను ఎంసీపీఐ(యూ) కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రజల డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు గాదగోని రవి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు కాటం నాగభూషణం, పొలిట్‌బ్యూరో సభ్యులు మోర్తాల చందర్‌రావు, నర్ల చంద్రశేఖర్‌, కేరళకు చెందిన పొలిట్‌బ్యూరో సభ్యుడు కే. శ్రీకుమార్‌తో పాటు కేంద్ర కమిటీ సభ్యులు గోనె కుమారస్వామి, మాడిశెట్టి అరుణ్‌కుమార్‌, సింగతి సాంబయ్య, పానుగంటి నర్సయ్య, బి. బాబు, మాదం తిరుపతి, సందెపోగు ఉదయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here