బాల్యవివాహాల నిర్మూలనకు గ్రామసభల ప్రతిజ్ఞ : డాక్టర్ బండి సాయన్న

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దేశవ్యాప్తంగా బాల్యవివాహాల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక గ్రామసభల కార్యక్రమాన్ని స్పందన కల్చరల్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ (స్కోప్) సంస్థ స్వాగతించింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న దేశంలోని గ్రామసభల‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, తమ గ్రామాలను బాల్యవివాహ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు తీర్మానాలు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని స్కోప్ అధ్యక్షుడు డాక్టర్ బండి సాయన్న పేర్కొన్నారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖల ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించి బాల్యవివాహాల నిర్మూలనకు సమిష్టిగా ప్రతిజ్ఞ చేశారు. ఇప్పటివరకు 2.42 లక్షలకు పైగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించినట్లు స్కోప్ తెలిపింది. ఈ సమావేశాల్లో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

జనగామ, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బాల్యవివాహాల నిర్మూలనకు స్కోప్ సంస్థ పనిచేస్తోంది. ప్రభుత్వంతో పాటు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని డాక్టర్ బండి సాయన్న తెలిపారు. దేశంలోని ప్రతి గ్రామం నుంచి బాల్యవివాహాలను నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర మంత్రిత్వ శాఖలు ప్రత్యేక గ్రామసభల ద్వారా చేపట్టిన ఈ ప్రచారాన్ని స్కోప్ సంస్థ హృదయపూర్వకంగా స్వాగతిస్తోంది. ఈ దిశగా జిల్లా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు కూడా అభినందనీయం అని డాక్టర్ బండి సాయన్న అన్నారు. 2030 నాటికి భారతదేశాన్ని బాల్యవివాహ రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యానికి ఈ కార్యక్రమం నూతన ఉత్తేజాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. బాల్యవివాహాల వంటి సామాజిక దురాచారాలను నిర్మూలించేందుకు గ్రామం, సమాజం మొత్తం ఏకమై పనిచేస్తే మార్పు వేగంగా సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి బాలిక తన బాల్యాన్ని ఆనందంగా గడుపుతూ, తన కలలను సాకారం చేసుకునే అవకాశాన్ని పొందాలని ఆకాంక్షించారు.

స్కోప్ సంస్థ దేశంలో బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ (జెఆర్‌సీ) భాగస్వామ్య సంస్థగా కొనసాగుతోంది. జెఆర్‌సీ దేశవ్యాప్తంగా 300కు పైగా భాగస్వామ్య స్వచ్ఛంద సంస్థలతో కలిసి 782 జిల్లాల్లో ప్రభుత్వాలు, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేస్తోంది. 2024లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బాల్యవివాహ రహిత భారత్ (Child Marriage Free India) ప్రచారంతో ఈ ఉద్యమం మరింత వేగం పుంజుకుందని స్కోప్ తెలిపింది. ఒక తరం కాలంలోనే బాల్యవివాహాల ఆచారాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో జెఆర్‌సీ, దాని భాగస్వామ్య సంస్థలు దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాయి. సమిష్టి కృషి ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని, నిర్ణయించిన గడువు కంటే ముందుగానే బాల్యవివాహ రహిత భారతదేశం లక్ష్యం సాకారమవుతుందనే ఆశాభావాన్ని స్కోప్ వ్యక్తం చేసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here