శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): బాల్య వివాహాల నిర్మూలనకు మత పెద్దలు కీలక భాగస్వాములుగా వ్యవహరించాలని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి అన్నారు. సంగారెడ్డి జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, మత పెద్దలు, తల్లిదండ్రులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాల్య వివాహ నిషేధ చట్టం–2006పై మత పెద్దలకు అవగాహన కల్పించేందుకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, స్పందన కల్చరల్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ (స్కోప్) ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని మహిళా ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహంతో–బతుకు ఆగం అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పూజారులు, పాస్టర్లు, ముస్లిం మత పెద్దలు, క్వాజీలతో పాటు సుమారు 100 మంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లలిత కుమారి మాట్లాడుతూ, 18 ఏళ్ల లోపు బాలికలకు, 21 ఏళ్ల లోపు బాలురకు వివాహం చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత వ్యక్తులతో పాటు వివాహాన్ని నిర్వహించే మత పెద్దలపైనా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. వివాహం నిర్వహించే ముందు వధూవరుల పుట్టిన తేదీ, వయస్సు ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. బాలికకు 18, బాలుడికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. అన్ని మతాల మత పెద్దల సహకారంతో సంగారెడ్డి జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్ రాజా రెడ్డి మాట్లాడుతూ, బాల్య వివాహాల నిర్మూలన ఒక్క శాఖ బాధ్యత కాదన్నారు. ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, మత పెద్దలు, తల్లిదండ్రులు, ప్రజలు సమన్వయంతో పనిచేసినప్పుడే బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టగలమని తెలిపారు.
డి సి ఆర్ బి సి ఐ రమేష్ మాట్లాడుతూ, బాల్య వివాహాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బాల్య వివాహ నిషేధ చట్టంలోని శిక్షలు, జరిమానాలపై మత పెద్దలకు అవగాహన కల్పించారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి రత్నం మాట్లాడుతూ, బాల్య వివాహాల నిర్మూలన కోసం జిల్లా బాలల పరిరక్షణ విభాగం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. బాల్య వివాహాలను అరికట్టడంలో మత పెద్దలు చురుకైన భాగస్వాములుగా మారాలని కోరారు. స్కోప్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ ఉప్పలయ్య మాట్లాడుతూ, బాల్య వివాహాల నిర్మూలన, బాలల రక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సంస్థ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను వివరించారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వ శాఖలతో కలిసి నిరంతరం పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యులు వెంకటేశం, విష్ణుమూర్తి, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ యాదగిరి, డీసీపీయూ సిబ్బంది లింగం, యాదగిరి, స్కోప్ సంస్థ సభ్యులు రామా గౌడ్, సావిత్రి, సవిత తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలను అరికట్టి ప్రతి బాలబాలికకు విద్య, రక్షణ, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కల్పించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని కార్యక్రమంలో పిలుపునిచ్చారు.





