మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్లోని దుర్గం చెరువు తీగల వంతెనపై కారు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం మాదాపూర్ నుండి బంజారాహిల్స్ వైపు వెళ్తున్న ఓ కారు కేబుల్ బ్రిడ్జిపైకి రాగానే టైర్ పేలి అకస్మాత్తుగా పల్టీలు కొట్టింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉండగా, పాదచారుల సాయంతో స్వల్ప గాయాలతో బయట పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ పోలీసులు వెంటనే కారును అక్కడినుండి తరలించి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.