శేరిలింగంపల్లి, అక్టోబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ కాలనీలో రైల్వే అండర్పాస్ వద్ద రూ.70 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన వరద నీటి కాలువ, సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బుధవారం అండర్పాస్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, డీసీ సేవా ఇస్లావత్, ట్రాఫిక్ ఏసీపీ ఆదిమూర్తి, ట్రాఫిక్ సీఐ నర్సింహారెడ్డి, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. మంజీరా పైప్లైన్ రోడ్డు నుంచి మసీదుబండకు వెళ్లే మార్గంలోని రైల్వే అండర్పాస్ వద్ద తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనదారులకు రాకపోకలు కష్టంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూ.70 లక్షలతో వరద నీటి కాలువ, సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేసినట్లు వెల్లడించారు. అండర్పాస్ను అభివృద్ధి చేయడంతో ఇకపై రెండు వాహనాలు ఒకేసారి సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుంటుందని గాంధీ తెలిపారు. ఈ పనులు చుట్టుపక్కల కాలనీల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, ట్రాఫిక్ సమస్యను తగ్గించడంతో పాటు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.

నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారాలు చూపేలా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని గాంధీ పునరుద్ఘాటించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఎస్ఈ శంకర్ నాయక్, ఈఈ శిరీష, డీఈ ఆనంద్, ఏఈ భాస్కర్, స్థానిక నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





