శేరిలింగంపల్లి, అక్టోబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి పలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని హుడా కాలనీ పార్కులో 200 గజాల స్థలం కబ్జా అయిందని ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఈ సమస్యపై 10 సార్లు ఫిర్యాదు చేశానని, అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కనుక ఇప్పటికైనా స్పందించి పార్కు స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలని కోరారు.
అదేవిధంగా చందానగర్ జాతీయ రహదారి పక్కన ఉన్న భారీ వ్యాపార సముదాయాలు అక్రమంగా చిరు వ్యాపారులకు వ్యాపారం చేసుకునేందుకు అనుమతులు ఇస్తున్నాయని అన్నారు. వారి నుంచి లక్షల రూపాయలను అడ్వాన్స్‌గా తీసుకుంటున్నారని, చిరు వ్యాపారుల నుంచి నెలకు రూ.30 వేల వరకు అద్దె తీసుకుని వారు తమ షాపుల ముందు వ్యాపారం చేసుకునేందుకు అనుమతిస్తున్నాయని అన్నారు. దీని వల్ల పార్కింగ్ సమస్య, ట్రాఫిక్ జామ్ అవుతుందని అన్నారు. దీంతో సామాన్యులు ఫైన్ కట్టాల్సి వస్తుందని, కనుక ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో కోరారు.