శేరిలింగంపల్లి, డిసెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణల రూపశిల్పి, రాజనీతజ్ఞుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అకాల మరణం తీరని లోటు అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రవి కుమార్ యాదవ్ అన్నారు. కొండాపూర్ మసీద్ బండ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని, దేశానికి ఆయన చేసిన సేవ, రాజకీయ జీవితం వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు.
పార్టీలకతీతంగా ఎవరెన్ని విమర్శలు చేసినా మౌనంగా తన పనిని తాను చేసుకుంటూ అంతే మౌనంగా తన జీవన ప్రస్థానానికి వీడ్కోలు పలికారని చింతించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు సాగర్, రాజు, రమేష్, కుమార్ యాదవ్, పద్మ, రేణుక, మహేష్, రాజు, ప్రదీప్, మహేష్ , మధు, మనోజ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.