బీహెచ్‌ఈఎల్ నుంచి బందంకొమ్ము వరకు ఫ్లైఓవర్, 4 లైన్ల రోడ్ పనులు షురూ

శేరిలింగంప‌ల్లి, జూన్ 1 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి, అమీన్‌పూర్ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. బీహెచ్‌ఈఎల్ చౌరస్తా నుంచి అమీన్‌పూర్ బందంకొమ్ము వరకు నేషనల్ హైవేతో అనుసంధానం చేసే ఫ్లైఓవర్ నిర్మాణం, నాలుగు లైన్ల రహదారి అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు పనులను మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు, సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డితో కలిసి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీహెచ్‌ఈఎల్ చౌరస్తా నుంచి అమీన్‌పూర్ బందంకొమ్ము వరకు నాలాపై ఫ్లైఓవర్ నిర్మాణం, నాలుగు లైన్ల రహదారి అభివృద్ధి శేరిలింగంపల్లి, అమీన్‌పూర్ ప్రజల చిరకాల స్వప్నమని పేర్కొన్నారు. గతంలో ఈ రహదారి నిర్మాణం కోసం బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించామని గుర్తుచేశారు.

ఈ సమస్యను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు దృష్టికి తీసుకెళ్లగా, వారు ప్రత్యేక చొరవ తీసుకుని జీహెచ్‌ఎంసీ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారని తెలిపారు. రఘునందన్ రావు స్వయంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్‌తో కలిసి ప్రాంతాన్ని సందర్శించి సమస్య తీవ్రతను వివరించడంతో ప్రాజెక్టుకు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. గత వారం రోజులుగా నాలా డైవర్షన్ పనులు కూడా ప్రారంభమైనట్లు వెల్లడించారు. ఎన్నో సంవత్సరాలుగా అధికారంలో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించిన రవికుమార్ యాదవ్, ఈ ప్రాజెక్టు బీజేపీ ఎంపీల కృషి, ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు. భవిష్యత్తులో కూడా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రజలు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని, ప్రజల కోసం పని చేసే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి, సింధు రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రామిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, వెంకటేష్, రాజు శెట్టి, మల్లేష్ గౌడ్, సూర్యకాంత్‌, శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here