విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: గడ్డం నాగార్జున

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఏఐఎఫ్డిఎస్ గ్రేటర్ హైదారాబాద్ జిల్లా కమిటీ సమావేశం MA నగర్ యంసిపిఐ(యు) కార్యాలయంలో వల్లెపు దినేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్బంగా గడ్డం నాగార్జున మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా తయారయ్యాయ‌ని, గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థ భ్రష్టుపట్టించింద‌ని అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం చేయడంలో వైఫల్యం చెందిన విషయాలను కాంగ్రెస్ పార్టీ ఆసరాగా తీసుకొని ఎన్నికల సమయంలో, వివిధ సందర్భాల్లో తాము అధికారంలోకి వస్తే సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తాం అని కాంగ్రెస్ నాయకులు చెప్పడం జరిగింది. విద్యార్ధి, యువత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తీవ్రమైన కృషి చేశారు. ఎట్టకేలకు కాంగ్రెస్ అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న గ‌డ్డం నాగార్జున

విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తి అవుతున్న కూడా విద్యారంగంలో ఉన్న సమస్యలపై ఇంతవరకు ఒక్క సమీక్ష సమావేశం కూడా నిర్వహించని పరిస్థితిలో ఉన్నారు. సాక్ష్యాత్తు విద్యాశాఖ రేవంత్ రెడ్డి వద్ద ఉండటం వలన రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని అందరూ భావించారు. కానీ నేడు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ప్రాథ‌మిక పాఠశాల మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు అనేక సమస్యలతో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు. గురుకులాల్లో ఉన్న విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురైతున్నారు. అద్దె భవనాలలో కొనసాగుతున్న వాటికి ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో వారు వాటికి తాళాలు వేయడం జరిగింది. విద్యార్థులు స్వచ్చందంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నా అధికారుల్లో చలనం కూడా లేదని, సాంఘిక, సంక్షేమ హాస్టళ్ల‌లో ఉన్న సమస్యల‌కు పరిష్కారం చూపకపోవడం, నాణ్యతతో కూడిన భోజనం పెట్టకపోవడంతో అనేక మంది విద్యార్థులు అనారోగ్యబారిన పడటం, ఇవన్నీ సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారు.

బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థిని స్వాతి ప్రియ ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న శ్రీ చైతన్య నారాయణ జూనియర్ కళాశాలలో విచ్చలవిడిగా లక్షల ఫీజులు తీసుకుంటూ విద్యార్థులను ర్యాంకుల పేరిట ఇబ్బందుల‌కు గురిచేసి ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా టార్చర్ పెట్టడం వల్ల విద్యార్థిని విద్యార్థులు శ్రీ చైతన్య నారాయణ జూనియర్ కళాశాలల‌లో ఆత్మహత్యలకు పాల్పడతావున్నారు దీనిపైన సమగ్రమైన విచారణ చేసి శ్రీ చైతన్య నారాయణ జూనియర్ కళాశాలల పర్మిషన్ రద్దుచేసి యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

అనంతరంఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లె మురళి, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు 7,800 కోట్లు బకాయిలు మూడు సంవత్సరాలుగా విడుదల చేయకపోవడంతో దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. తమ కోర్సులు పూర్తి అయినా కూడా కళాశాల యాజమాన్యాలు తమ ధ్రువపత్రాలు ఇవ్వకపోవడంతో వారు ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. క‌నుక సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే విద్యారంగoపై సమీక్ష నిర్వహించి సమస్యలు పరిష్కారం చేయాలని తెలియజేశారు. లేని పక్షంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరాటాలు కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు.

సమావేశానంతరం గ్రేటర్ హైదరాబాద్ కన్వీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ గా ముత్తెనగరి శ్రీకాంత్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐక్య ప్రజానాట్యమండలి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మైదం శెట్టి రమేష్, శ్రీకాంత్, రాజేంద్ర, వంశీ, దినేష్, వెంకటేష్, జావెద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here