మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీరాముడితోపాటు అయోధ్యలో నిర్మించనున్న రామ మందిర నిర్మాణానికి చేపట్టిన నిధి సేకరణ కార్యక్రమంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెరాస ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మియాపూర్ డివిజన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు డీఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి నిధులను సేకరిస్తుంటే ఆ విషయాన్ని రాజకీయాలు చేసేందుకే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీన్ని బీజేపీ పూర్తిగా ఖండిస్తుందన్నారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ గౌడ్, మనోహర్, కల్యాణ్, డివిజన్ అధ్యక్షులు మాణిక్ రావు, ప్రశాంతి, మహేష్, లక్ష్మణ్, కుమారస్వామి, రామకృష్ణారెడ్డి, ప్రసాద్, శ్రీశైలం, గణేష్, అశోక్, చందు, రత్న కుమార్, సిద్దు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.