మిస్సింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి: సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్

  • ప్రజలు ఆందోళన చెందవద్దు
  • మిస్సింగ్ కేసులపై వెంటనే ఫిర్యాదు చేయండి

సైబరాబాద్‌ ‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మిస్సింగ్‌ కేసులు వ్యవస్థీకృత నేరాలు కావు.. కేవలం వ్యక్తిగత కేసులు మాత్రమే. మిస్సింగ్‌ లను నివారించడానికి పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారని, ప్రజలు భయాందోళన చెందవద్దని సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ అభయమిచ్చారు. మిస్సింగ్‌ కేసులకు సంబంధించి కుటుంబ సభ్యులు, మిస్సింగ్‌ అయిన వ్యక్తులు, పిల్లల తాలూకు బంధవులెవరైనా సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ల‌లో ఫిర్యాదు చేసినట్టయితే వారికి తగిన న్యాయం చేస్తామని సీపీ అన్నారు.

సైబ‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్

అదృశ్యం వెనుక కారణాలు…

  • ఇటీవల కాలంలో మిస్సింగ్ కేసుల వార్తలను తరచుగా వింటున్నాం. తెలిసీ తెలియని వయసులో చిన్నారులు ఇంటి నుంచి తప్పిపోవడం, ప్రేమ పేరుతో టీనేజర్లు, వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాలు, అప్పులు, ఆత్మహత్య చేసుకోవటం, ఇతరత్రా కారణాల నేపథ్యంలో అదృశ్యమవుతున్నారు.
  • పరీక్ష ఫలితాల వెల్లడి సమయంలో ఎక్కువగా విద్యార్థుల మిస్సింగ్‌ కేసులు నమోదవుతుంటాయి. ఇలా వెళ్లిన పిల్లల్లో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా ఇండ్లకు తిరిగి వచ్చేస్తుంటారు.
  • పరీక్షల సమయంలో లవ్ ఎఫైర్స్ ఉన్న కొంత మంది యువత సైతం ఇంటి గడప దాటుతున్నారు.
  • తల్లిదండ్రులతో తరచూ తగువులాడిన‌ పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల మీద అలిగి వెళ్లిపోతుంటారు.
  • ప‌రీక్షల్లో మార్కులు సరిగా రాలేదనే కారణంతో చిన్నారులు మాయమవుతుంటే.. ఆర్థిక ఇబ్బందులతో పలువురు మధ్య వయస్కులు ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నారు.
  • ప్రేమ వ్యవహారాలు మరో కారణం. అమ్మాయిల విషయానికిస్తే మోసగాళ్ల ప్రేమలో పడి పారిపోవటం, ఇష్టం లేని పెళ్లి, కుటుంబంలో ప్రతికూల వాతావరణం వంటి పలు కారణాలు అధికంగా కనిపిస్తున్నాయి.
  • మహిళలు అత్తింట్లో సరైన ఆదరణ లేకపోవడం, హింసను భరించలేక వెళ్లిపోతున్నారు.
  • వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాలు, అప్పులు, ఆత్మహత్య చేసుకోవటం, ఇతరత్రా కారణాల నేపథ్యంలో అదృశ్యమవుతున్నారు.
  • వృద్ధుల అదృశ్యానికి పిల్లలు తమను సరిగా చూడటం లేదనేదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
  • మతిస్థిమితం సరిగా లేకపోవడమూ మరో కారణంగా ఉంది.
  • అప్పులు, ఇతర ఆర్థిక కారణాల వల్ల కొందరు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోతున్నారు. అబ్బాయిలు చదువు పట్ల భయం, తప్పు చేసి పెద్దల భయానికి పారిపోవటం, చెడు స్నేహం, దురలవాట్ల కారణంగా ఇటీవలి కాలంలో అదృశ్యమవుతూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
  • సోషల్‌ మీడియా కారణంగా అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఆకర్షణ పెరిగింది. వీటి ద్వారా అదుపు లేకుండా మాట్లాడుకోవడం. ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రేరేపించే అంశంగా మారుతోంది. యుక్త వయసులో సహజంగా ఉండే ఆకర్షణ వీరిని కట్టు తప్పేలా చేస్తోంది.
  • బయట ప్రపంచాన్ని కొత్త బంగారు లోకంలా ఊహించుకొని గడపదాటుతున్నారు. యుక్త, మధ్య వయస్కుల అదృశ్యం ఘటనలకు ఎక్కువగా ప్రేమ, వివాహేతర సంబంధాలు కారణమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైనవారి పట్ల ఆకర్షితులై కొందరు గడప దాటుతున్నారు.

ప్రజలకు సూచనలు..

  • ఆపరేషన్‌ స్మైల్‌ ద్వారా తప్పిపోయిన చిన్నారులను రక్షించి వారికి కొత్త జీవితాన్ని ఇస్తున్నారు.
  • ఆపరేషన్‌ ఆసరా ద్వారా తప్పిపోయిన వద్ధులు, ఇతరులను సంరక్షణ కేంద్రాలకు తతరలించి వారికి ఆసరాగా నిలుస్తున్నారు.
  • మతిమరుపు, మతిస్థిమితం సరిగ్గా లేని వారు, మెడికల్‌ ప్రాబ్లమ్స్‌ ఉన్న వారికి జేబులో వారి పేరు, చిరునామా, సంబంధీకుల ఫోన్‌ నంబర్‌ రాసి ఉంచడం మంచిది. తప్పిపోయిన సందర్భంలో ఇంటికి చేర్చేందుకు వీలవుతుంది.
  • తప్పిపోయిన వారిని గుర్తించేందుకు లేటెస్ట్‌ లొకేషన్‌ ఫైండ్‌ యాప్స్‌, అండర్‌ గ్యాడ్జెట్స్‌ను వినియోగంలోకి తీసుకోవడం ఉత్తమం.
  • అదృశ్యమైన చిన్నారుల ఆచూకీని కనిపెట్టడం కోసం పోలీసులు ముఖాలను గుర్తించే సాంకేతికతను వినియోగిస్తున్నారు. ‘దర్పణ్‌’ పేరుతో ఒక యాప్‌ను ప్రవేశపెట్టారు.

తల్లిదండ్రులకు సూచనలు..

  • నిత్యం మార్కులు, ర్యాంకుల పేరుతో పిల్లకపై ఒత్తిడి పెంచడం మంచిది కాదు.
  • భార్య భర్తలు ఇద్దరూ పని చేసేవారైతే పిల్లల భద్రత విషయంలో తల్లితండ్రులు వారికి నమ్మకమైన వ్యక్తుల ద్వారా తగు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
  • తమ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, వారికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి. ఫొన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చూస్తున్నారు, పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు తగిన సూచనలు చేయాలి.

విద్యార్థులకు సూచనలు..

  • చదువు విషయంలో, మరే ఇతర విషయాల్లో మీ తల్లిదండ్రులు ఏదైనా అంటే అది మీపై ప్రేమతోనే కానీ కోపంతో కాదు. తల్లిదండ్రుల ఆశీస్సులతోనే జీవితంలో ఎంతో మంది ఉన్నత శిఖరాలకు ఎదిగారు.
  • ఇంటి నుంచి బయటకు వెళ్లాలనుకునే వారు మిమ్మల్ని కానీ, పెంచి విద్యాబుద్ధులను నేర్పించిన తల్లిదండ్రుల గురించి ఒకసారి ఆలోచించాలి. పేరంట్స్ లేనిది ఉంటామనే నమ్మకం మీకు ఉండవచ్చు. కానీ మీరు లేనిది వారు ఉండలేరనే విషయాన్ని గమనించండి. మీరే మీ తల్లిదండ్రుల ప్రపంచం.
  • మీ తల్లిదండ్రులు మీ పట్ల ప్రేమతో మీ భవిష్యత్తు బాగుండాలని నిరంతరం ఆలోచిస్తారు.
  • ఈ ప్రపంచంలో మీ తల్లిదండ్రులకంటే మిమ్మల్ని ఎక్కువగా ఎవరూ ప్రేమించ‌రు.
  • ఇంటి నుంచి బయటకు వెళ్లిన తరువాత పరిణామాలను ఆలోచించాలి.

టీనేజర్లు, వృద్ధులకు సూచనలు..

  • ప్రేమిస్తే తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పండి. అంతేగానీ ఇంటి నుంచి వెళ్లిపోయి కనిపెంచిన తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చకండి.
  • వివాహం అయిన వారు వివాహేతర సంబంధాల‌ కోసం ఇంటి నుంచి వేళ్లిపోయే వారు తమ జీవిత భాగస్వామి, తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.
  • ఏదైనా గొడవలు కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోవాలనే భార్య, భర్తలు పెద్ద మనుషుల సమక్షంలో సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి లేదా భరోసా సెంటేర్ ను సంప్రదించాలి.
  • పిల్లల ఆద‌రణ లేని వృద్ధులు ఈ వయసులో ఇంటి నుంచి వెళ్లిపోవడం సరి కాదు. ఏదైనా సమస్య ఉంటే కుటుంబ సభ్యులందరితో మాట్లాడి పరిష్కరించుకోవాలి.

తప్పిపోయిన వారెవరైనా కనిపిస్తే వెంటనే డయల్‌ 100 లేదా సైబరాబాద్‌ వాట్సాప్‌ నంబర్‌ 9490617444 లో పోలీసులకు సమాచారం ఇవ్వండి. అట్టి వారిని వారి ఇంటికి వెంటనే పంపించే చర్యలు తీసుకోబడతాయి. అలాంటి సమాచారం ఇచ్చిన వారికి పోలీస్‌ శాఖ తరపున ప్రత్యేక గుర్తింపు ఇవ్వబడుతుంద‌ని సీపీ స‌జ్జ‌నార్ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here