మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): స్నానం చేసేందుకు నీటి కొలను లోకి వెళ్ళిన బాలుడు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మియాపూర్ న్యూ కాలనీ కి చెందిన చిన్న, రాధిక ల కుమారుడు తరుణ్(14) శనివారం తన స్నేహితులతో కలిసి కాలనీ సమీపంలోని ఖాళీ స్థలంలో ఉన్న నీటి కొలను లోకి స్నానం చేసేందుకు వెళ్ళాడు. ఈ క్రమంలో తరుణ్ కు ఈత రాకపోవడంతో కొలనులో మునిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో నీరు నిల్వ ఉండే ప్రాంతాలకు పిల్లలను వెళ్లకుండా చూడాలని పోలీసులు తల్లిదండ్రులకు సూచించారు.