శేరిలింగంపల్లి, అక్టోబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): దొంగతనం చేశాడనే ఆరోపణలతో మనస్థాపం చెందిన ఓ యువకుడు ఫ్యాన్‌కు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రం హైలకండి జిల్లా కట్లిచెర్రా గ్రామానికి చెందిన అంజద్ హుస్సేన్ బల్బూరియా (19) బ్రతుకు దెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి మాదాపూర్‌లోని సిద్ధిక్‌నగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని నివసిస్తూ ఆన్లైన్ పెస్ట్ కేర్ అనే సంస్థలో హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గదిలో తన స్వగ్రామానికి చెందిన ఫయాజుద్దీన్ లస్కర్ అనే యువకుడు కూడా నివసించ సాగాడు. ఈ నెల 16న సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఫయాజుద్దీన్ లస్కర్ కూరగాయలు కొనేందుకు గది నుంచి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో అంజద్ ఒక్కడే గదిలో ఉన్నాడు. సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో ఫయాజుద్దీన్ తిరిగి గదికి వచ్చి చూడగా, గది తలుపులు, కిటికీలు లోపలి నుంచి మూసి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన ఫయాజుద్దీన్ స్థానిక సహాయంతో తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా అంజద్ ఫ్యాన్‌కు తాడుతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే అతన్ని కిందకు దించి చూడగా, అతను అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఈనెల 15న అంజద్ పనిచేస్తున్న ఆన్లైన్ పెస్ట్ కేర్ సంస్థ యజమాని గౌతమ్‌తోపాటు, అదే సంస్థలో పనిచేస్తున్న అస్సాం రాష్ట్రానికి చెందిన ఆనం, షరీఫ్ అనే ఇద్దరు వ్యక్తులు అంజద్ గదికి వచ్చి తనిఖీలు చేశారు. అంజద్ సంస్థ నుంచి పెస్టిసైడ్ కెమికల్స్‌ను దొంగిలించి ఉంటాడని వారు ఆరోపించారు. దీంతో మనస్థాపానికి గురైన అంజద్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అతని ఆత్మహత్యకు ఇదే కాకుండా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.





