సీఎంసీ వాక్‌-ఫ్రీ డ్రైవ్‌.. 265 ఆక్రమణలు తొలగింపు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ) పరిధిలో ఆక్రమణల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయి. పాదచారులకు ఇబ్బందులు లేకుండా రహదారులను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా చేపట్టిన వాక్‌-ఫ్రీ డ్రైవ్‌లో 265 ఆక్రమణలను తొలగించారు. మొత్తం 14.47 కిలోమీటర్ల మేర రహదారి మార్గాలను ఆక్రమణల నుంచి క్లియర్‌ చేసినట్లు సీఎంసీ వెల్లడించింది. శేరిలింగంపల్లి జోన్‌లో అత్యధికంగా 97 ఆక్రమణలను తొలగించి 6.57 కిలోమీటర్ల మేర రహదారిని క్లియర్‌ చేశారు. ఇందులో నార్సింగిలో 16, అమీన్‌పూర్‌లో 8, పటాన్‌చెరులో 26, మియాపూర్‌లో 15, శేరిలింగంపల్లిలో 32 ఆక్రమణలను తొలగించారు. కూకట్‌పల్లి జోన్‌లో 76 ఆక్రమణలను తొలగించారు. మొత్తం 2.80 కిలోమీటర్ల మేర రహదారి మార్గాలను క్లియర్‌ చేశారు. మూసాపేట్‌లో 30, కూకట్‌పల్లిలో 12, మాదాపూర్‌లో 20, ఆల్విన్‌ కాలనీలో 14 ఆక్రమణలను తొలగించినట్లు అధికారులు తెలిపారు.

కుత్బుల్లాపూర్‌ జోన్‌లో 92 ఆక్రమణలను తొలగించి 5.10 కిలోమీటర్ల మేర రహదారులను అందుబాటులోకి తీసుకొచ్చారు. కొంపల్లిలో 7, మేడ్చల్‌లో 7, చింతల్‌లో 16, గాజులరామారంలో 22, జీడిమెట్లలో 14, నిజాంపేట్‌లో 14, దుండిగల్‌లో 12 ఆక్రమణలను తొలగించారు. ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో మళ్లీ అవి ఏర్పడకుండా క్రమం తప్పకుండా ఫాలో-అప్‌ తనిఖీలు నిర్వహించనున్నట్లు సీఎంసీ తెలిపింది. పాదచారులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రాకపోకలు సాగించేలా చూడటంతో పాటు ప్రజా రహదారులు, స్థలాలను అందుబాటులో ఉంచడమే వాక్‌-ఫ్రీ డ్రైవ్‌ లక్ష్యమని పేర్కొంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here