శేరిలింగంపల్లి, అక్టోబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌లో నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్లు (వేప్స్) విక్రయిస్తున్న దుకాణంపై పోలీసులు దాడి చేసి 67 వేప్స్‌తోపాటు రూ.1,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ సీహెచ్ సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ 1న సాయంత్రం 5:30 గంటల సమయంలో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్‌ను మైనర్లు, పెద్దలకు విక్రయిస్తున్నట్లు పోలీసులకి విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఇద్దరు పంచ సాక్షుల సమక్షంలో పోలీసుల ప్రత్యేక బృందం సాయంత్రం 6:15 గంటల సమయంలో కావూరి హిల్స్‌లోని మోహిత్ ప్లాజా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న హోలీ స్మోక్ దుకాణంలో తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల సమయంలో కౌంటర్ వద్ద ఉన్న అబ్దుల్ రషీద్ పి.ఎం. (28), షిహాబుద్దీన్ పి.ఎం. (34)లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద వివిధ బ్రాండ్లకు చెందిన 67 ఎలక్ట్రానిక్ సిగరెట్లు, వేప్స్, రూ.1,500 నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్లు, వేప్స్ విక్రయిస్తున్నట్లు వారు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరో సంఘటనలో..
మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ, హైటెక్ బావర్చి హోటల్ సమీపంలోని స్మోకిన్ స్పాట్ లో నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్లు, వేప్‌లు విక్రయిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పంచ సాక్షుల సమక్షంలో పోలీసులు షాపులో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రయానికి సిద్ధంగా ఉంచిన 25 ఈ-సిగరెట్లు, వేప్‌లు, 15 బాక్సుల విదేశీ సిగరెట్లు, విక్రయాల ద్వారా వచ్చినట్లు అనుమానిస్తున్న రూ.1,090 నగదు, వ్యాపారానికి ఉపయోగించిన మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
షాపులో పనిచేస్తున్న అబ్దుల్ అర్షద్ (29), మహ్మద్ ఆదిల్ (21)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో షాపు యజమాని మహ్మద్ హనీఫ్ (31), కేరళకు చెందిన వ్యక్తి, ఈ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై క్రైం నంబర్ 1514/2026లో ఫిర్యాదులో పేర్కొన్న సంబంధిత చట్ట నిబంధనల కింద కేసు నమోదు చేశారు. ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని మాదాపూర్ పోలీసులు వెల్లడించారు.





