శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): వెంకటేశ్వర నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్, ఈనాడు కాలనీ, కమల ప్రసన్న నగర్ కాలనీలలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (UGD) పైప్‌లైన్ నిర్మాణ పనులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, జలమండలి అధికారులతో కలిసి ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. కాలనీల్లో భూగర్భ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. స్థానికుల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని, అత్యవసరంగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. నిత్యం డ్రైనేజీ పొంగిపొర్లుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో పనులను వేగంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యమని గాంధీ తెలిపారు. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ సమస్యలులేని ఆదర్శవంతమైన కాలనీలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రతి కాలనీలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు అవసరమైన మంచినీటి పైప్‌లైన్ నిర్మాణ పనులను కూడా చేపడతామని తెలిపారు. UGDతో పాటు ఇతర అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని గాంధీ తెలిపారు. ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి DGM శ్రీనివాస రాజు, మేనేజర్ అనిల్, నాయకులు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.





