దిశ రిపోర్ట‌ర్‌ భూమేష్‌ను బ‌ల‌వంతంగా స్టేష‌న్‌కు త‌ర‌లించిన పోలీసులు… తీవ్రంగా ఖండించిన టీయూడ‌బ్ల్యూజే నేత‌లు…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: దిశ శేరిలింగంప‌ల్లి ఇన్చార్జీ తుడుం భూమేష్‌ను కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేష‌న్ సిబ్బంది అక్ర‌మంగా ఇంటి నుంచి తీసుకెళ్ల‌డాన్ని టీయూడ‌బ్ల్యూజే 143 తీవ్రంగా ఖండించింది. ఈ సంద‌ర్భంగా యూనియ‌న్ జిల్లా అధ్య‌క్షులు ఉప్ప‌రి శేఖ‌ర్ సాగ‌ర్‌, రాష్ట్ర నాయ‌కులు పైళ్ల విఠ‌ల్ రెడ్డి, జిల్లా ఉపాధ్య‌క్షులు గంట్ల రాజిరెడ్డి, శేరిలింగంప‌ల్లి అధ్య‌క్షులు ఉప్ప‌రి ర‌మేష్ సాగ‌ర్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మెట్టు జ‌గ‌న్‌రెడ్డి, టెంజూ అధ్య‌క్ష కార్య‌ద‌ర్శులు పోచ‌గోని సాగ‌ర్ గౌడ్‌, కిషోర్‌లు మాట్లాడుతూ వార్త‌లు రాస్తున్న జ‌ర్న‌లిస్టుల‌పై, యాజ‌మాన్యాల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయిస్తూ భ‌య‌బ్రాంతుల‌కు గురిచేయాల‌ని పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, దీనిని టీయూడ‌బ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తున్న‌ద‌ని అన్నారు. సంబంధం లేన వార్తను శేరిలింగంప‌ల్లి ఇన్చార్జీ భూమేష్‌కు ఆపాదిస్తూ కుటుంబ స‌భ్యుల‌కు గాని, తాను ప‌నిచేస్తున్న సంస్థ‌కు గాని నోటీసులు ఇవ్వ‌కుండా ఇంటి నుంచి బ‌ల‌వంతంగా ఎత్తుకెళ్ల‌డం చ‌ట్ట‌విరుద్ద‌మ‌ని అన్నారు.

దిశ శేరిలింగంప‌ల్లి ఇన్చార్జీ భూమేష్‌ను బైక్‌పై బ‌ల‌వంతంగా తీసుకెళ్తున్న కేపీహెచ్‌బీ ఎస్ఐ రంజిత్ బృందం (సీసీ టీవీ ఫుటేజీ)

మూడు ద్విచ‌క్ర వాహ‌నాల‌పై సివిల్ డ్రెస్‌లో వచ్చిన పోలీసులు అత‌ని ఫోన్ లాక్కొని సంఘ విద్రోహ శ‌క్తిని తీసుకెళ్లిన‌ట్టు భూమేష్‌ను కేపీహెచ్‌బీ పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌న్నారు. ఒక వార్త ప్ర‌చురిత‌మైన‌ప్ప‌డు స‌ద‌రు వార్త డేట్‌లైన్‌ను ప‌రిశీలించి సంబంధిత రిపోర్ట‌ర్ లేదా యాజ‌మాన్యాన్ని భాద్యుల‌ను చేయాల్సిన పోలీసులు క‌క్ష‌పూరితంగా సంబంధంలేని వ్య‌క్తుల‌ను ల‌క్షంగా చేసుకుని హింసించ‌డం స‌బ‌బు కాద‌ని హిత‌వు ప‌లికారు. నెల క్రితం వ‌చ్చిన వార్తకు సంబంధించి స‌మ‌గ్ర విచార‌ణ జ‌రుప‌కుండా ఏక‌ప‌క్షంగా ఒక రీపోర్ట‌ర్‌ను బ‌లిప‌శువును చేయాల‌ని చూడ‌డం పోలీసుల‌కు త‌గ‌దని అన్నారు. రాజ్యాంగంలోని మౌళిక సూత్రాల‌కు విరుద్ధంగా పోలీసులు ప్ర‌వ‌ర్తించ‌డం హేయ‌మైన చ‌ర్య అని, భూమేష్ అరెస్ట్ విష‌యంలో తెలంగాణ పోలీసు శాఖ పూర్తి విచార‌ణ జ‌రిపి భాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. లేని యెడ‌ల టీయూడ‌బ్ల్యూజే ఎంత‌టి పోరాటానికైనా సిద్ధంగా ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్ట‌ర్ కిష‌న్ కుమార్ ఇచ్చిన 41(ఏ) సీఆర్‌పీసీ నోటీసుకు రిప్లై ఇస్తున్న బాధితుడు భూమేష్‌, తోటి జ‌ర్న‌లిస్టులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here