శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తోటి పేద మహిళలకు సేవ చేయాలనే సంకల్పంతో నారిసేనా గ్లోబల్ ఉమెన్ ఫోరమ్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ వ్యవస్థాపకురాలు లతా చౌదరి అన్నారు. సమాజంలో వెనుకబడిన మహిళలను చైతన్య పరచడం కోసం ఏర్పాటు చేసిన నారిసేన ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నిరు పేదలకు సాయం చేయడం కోసం వివిధ రకాల వస్తువులు సేకరించి అవసరం ఉన్న వారికి అందజేస్తున్నామని తెలిపారు. నారిసేన గ్లోబల్ ఉమెన్ ఫోరమ్, జ్యోతి విద్యాలయ హై స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులతో పాటు బట్టలు, బిస్కెట్లు అందజేశారు. ఇంట్లో వాడే వస్తువులను సేకరించి అవసరం ఉన్నవారికి అందజేయడం ఫోరమ్ లక్ష్యమన్నారు.
సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించడం కోసం మహిళలకు ఉచితంగా వివిధ రకాలైన టైలరింగ్, పెయింటింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ , కలంకారి, డాల్స్ మేకింగ్ వంటి కోర్సుల్లో శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన 150 మంది మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకుంటూ స్థిర పడ్డారని తెలిపారు. అలాగే వారి సమస్యలు తీర్చడానికి న్యాయ సలహాలు అందించడానికి లీగల్ సెల్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల్లో , 50 వేల మంది ఈ ఫోరమ్ లో పని చేస్తున్నారని ఆమె తెలిపారు. జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపల్, ఫోరమ్ అడ్మిన్ ఉమా మహేశ్వరి మాట్లాడుతూ తమ స్కూల్ తరపు నుండి కూడా సిబ్బందిని, తల్లిదండ్రులను సేవలో భాగస్వాములను చేస్తూ, తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 25 నుండి మార్చి 5 వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో ఇలా వస్తువుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి టీమ్ లీడర్స్ మణిప్రభ, దివ్యజ్యోతి, యశోద, చందానగర్ టీమ్ లీడర్స్ నీలం సౌమ్య, ఆలేఖ్య, శాంతి, విద్యశ్రీ పాల్గొన్నారు.