చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్‌లోని శ్రీదేవి థియేటర్ ఎదురుగా దుబ్బల రమణ అనే వ్యక్తి ఓ షాపు నిర్వహిస్తున్నాడు. కాగా ఓ యాచకుడు పగలంతా భిక్షాటన చేసి వచ్చి రాత్రి పూట రమణ షాపు ఎదుట నిద్రించేవాడు. అలా ఆ యాచకుడు వారం రోజుల నుంచి ఆ షాపు ఎదుట నిద్రిస్తున్నాడు. కాగా బుధవారం ఉదయం ఆ యాచకుడు ఎంతకూ నిద్ర లేవకపోయే సరికి అనుమానం వచ్చిన రమణ 108 సిబ్బందికి కాల్ చేసి సమాచారం అందించాడు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ యాచకుడు మృతి చెందాడని నిర్దారించారు. ఈ క్రమంలో చందానగర్ పోలీసులు ఆ వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతని వివరాలు తెలియదని, అతని ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే అతను మృతి చెంది ఉంటాడని, వయస్సు 65 ఏళ్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.