- మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవికుమార్ యాదవ్
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వరద బాధితులందరికీ సహాయం అందేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శేరిలింగంపల్లి ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్‌లు అన్నారు. బుధవారం శేరిలింగంపల్లిలోని జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ కు వారు వినతిపత్రం అందజేశారు. వరద బాధితులందరికీ రూ.10వేలు అందివ్వాలని అన్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. వరద బాధితులకు అందాల్సిన రూ.10వేల సహాయం ఇంకా చాలా మందికి అందలేదన్నారు. సహాయం అందని వారి వివరాలను అధికారులకు అందించామని, వారికి కూడా వెంటనే సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస పార్టీ జిమ్మిక్కులు చేసేందుకు యత్నిస్తుందని ఆరోపించారు. వరద సహాయాన్ని తెరాస నాయకులకు దోచి పెట్టాలని చూస్తున్నారని అన్నారు. అలా జరగకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని, నిజంగా నష్టపోయిన వారందరికీ సహాయం అందేంత వరకు పోరాటం చేస్తామని, బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నరసింహ యాదవ్, ఎల్లేష్, రఘునందన్ రెడ్డి, రాధాకృష్ణ, మన్నే సతీష్, మహిపాల్ యాదవ్ , నిజాం, ఇలియాస్ షరీఫ్, పద్మ, అల్లాఉద్దీన్, భరత్, రాజన్, అలీ పాల్గొన్నారు.