నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ భారత జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులకు జోహార్లు అర్పించారు. ప్రజాభివృద్దే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా సీఎం కేసీఆర్ సుపరిపాలన సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందని అన్నారు. ప్రతి సంక్షేమ పథకం పేదలకు చేరినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని, ప్రభుత్వ పథకాలను తీసుకువచ్చే ముందు పేద ప్రజలను గుర్తుకు తెచ్చుకోవాలని మహాత్మాగాంధీ చెప్పిన విషయాన్ని ఆరెకపూడి గాంధీ గుర్తు చేశారు. యువత మంచి స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో ,గొప్ప లక్ష్యాలతో ముందుకువచ్చి దేశ , రాష్ట్ర , ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్భంగా తెలిపారు.