శేరిలింగంపల్లి, అక్టోబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్‌లో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కేటాయింపులో లక్కీ డ్రా ప్రక్రియ కొనసాగింది. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి కేటాయించిన 480 ఫ్లాట్లకు లబ్ధిదారుల ఎంపికలో భాగంగా గచ్చిబౌలిలోని నిర్మిత కేంద్రంలో లక్కీ డ్రా నిర్వహించారు. లక్కీ డ్రాలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు కాలనీలకు చెందిన 22 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. అనంతరం సీనియర్ నాయకుడు గణేష్ ముదిరాజు ఆధ్వర్యంలో ఎంపికైన లబ్ధిదారులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ వారిని అభినందించారు.
లబ్ధిదారుల ఎంపికలో కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హతను ప్రామాణికంగా తీసుకుని పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించినట్లు గాంధీ తెలిపారు. లక్కీ డ్రాలో ఎంపికైన లబ్ధిదారులు తమ సొంతింటి కల నెరవేరబోతుండటంపై ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి కేటాయించిన 480 ఫ్లాట్లలో నిర్దేశించిన రిజర్వేషన్ ప్రకారం కేటాయింపులు చేపట్టినట్లు గాంధీ తెలిపారు. ఎస్సీలకు 14 శాతం 67 ప్లాట్లు, ఎస్టీలకు 5 శాతం 24 ప్లాట్లు, బీసీలకు 16 శాతం 77 ప్లాట్లు, జనరల్ 50 శాతం 240 ప్లాట్లు, ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 10 శాతం 48 ప్లాట్లు, దివ్యాంగులు 5 శాతం 24 ప్లాట్లు కేటాయించారు.
లక్కీ డ్రా అనంతరం లబ్ధిదారుల తుది ఎంపిక జరుగుతుందని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ధ్రువపత్రాలు అందజేస్తారని గాంధీ తెలిపారు. ఆ ప్రక్రియ పూర్తైన 3–4 రోజుల్లోనే ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం జరుగుతున్న సమయంలో ఎంపికైన లబ్ధిదారులు ఎప్పుడైనా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి పనులను పరిశీలించవచ్చని గాంధీ తెలిపారు. నిర్మాణ నాణ్యతపై లబ్ధిదారులకు పూర్తి హక్కు ఉంటుందని చెప్పారు. రాయదుర్గంలోని మల్కం చెరువు వద్ద ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఇటీవల శంకుస్థాపన జరిగిందని, నిర్మాణం పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తామని గాంధీ పేర్కొన్నారు.

ఇందిరమ్మ టవర్స్‌లో లబ్ధిదారులకు ఆధునిక ప్రమాణాలతో ఇళ్లను నిర్మించనున్నట్లు గాంధీ తెలిపారు. ప్రతిపాదిత ఇంటిలో ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్‌తో కలిపి సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న ఈ ఇళ్లలో లబ్ధిదారుడి పేరుతో అన్‌డివైడెడ్ షేర్ కింద సుమారు 20 నుంచి 25 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో భూముల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో నగరంలోనే సొంత ఇల్లు కావాలనే పేదల ఆకాంక్షను నెరవేర్చేందుకు ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని గాంధీ తెలిపారు. నగరంలోని విలువైన ప్రాంతాల్లోనూ పేద కుటుంబాలు గౌరవంగా జీవించేలా సొంత ఇంటిని అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం హైదరాబాద్ గృహ నిర్మాణ రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని గాంధీ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించేలా చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణేష్ ముదిరాజు, జంగయ్య యాదవ్, రవి, అనిల్ తదితరులతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.





