శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): గోపన్‌పల్లి వీకర్ సెక్షన్ సమీపంలోని ఖాళీ స్థలంలో భారీగా చెరువు పూడికతీత మట్టిని డంపింగ్ చేస్తున్నారని, దీనివల్ల స్థానిక ప్రజల ఇళ్లు, ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే వేసిన మట్టి కుప్పలను పూర్తిగా తొలగించే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నల్లగండ్ల, నానక్‌రామ్‌గూడ, కోకాపేట తదితర ప్రాంతాల్లోని చెరువుల పూడికతీత మట్టిని గత మూడు, నాలుగు నెలలుగా వందలాది ట్రిప్పుల ద్వారా గోపన్‌పల్లి వీకర్ సెక్షన్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో డంపింగ్ చేస్తున్నారని స్థానికులు గంగాధర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో భారీగా మట్టి కుప్పలు ఏర్పడి పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఈ నేపథ్యంలో గంగాధర్ రెడ్డి స్థానికులతో కలిసి మట్టి డంపింగ్ ప్రాంతంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగండ్ల చెరువు సుందరీకరణలో భాగంగా పూడికతీత మట్టిని తరలిస్తున్నట్లు హైడ్రా అధికారులు చెబుతున్నప్పటికీ, కోకాపేట, నానక్‌రామ్‌గూడ తదితర ప్రాంతాల నుంచి కూడా మట్టిని ఇక్కడికి తీసుకొస్తున్నారనే ఆరోపణలు స్థానికుల నుంచి వస్తున్నాయని పేర్కొన్నారు. ఏ చెరువు నుంచి ఎంత మట్టి తరలిస్తున్నారు? ఎన్ని ట్రిప్పులు వచ్చాయి? ఎవరి అనుమతులతో డంపింగ్ చేస్తున్నారు? అనే వివరాలను అధికారులు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. మట్టి తరలింపునకు సంబంధించిన వర్క్ ఆర్డర్, అనుమతులు, వాహనాల వివరాలు, డంపింగ్‌కు కేటాయించిన స్థలం తదితర సమాచారాన్ని బహిరంగపరచాలని కోరారు.

గోపన్‌పల్లి ప్రాంతంలో సహజంగా ఉన్న వర్షపు నీటి ప్రవాహ మార్గం, నాలాను మట్టితో పూడ్చివేస్తున్నారని స్థానికులు చెబుతున్నారని గంగాధర్ రెడ్డి తెలిపారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో మట్టి కుప్పల కారణంగా నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడితే సమీప ఇళ్లలోకి వరద నీరు చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను వరదల నుంచి కాపాడాల్సిన సంస్థలే వర్షపు నీటి ప్రవాహ మార్గాలకు ఇబ్బంది కలిగించేలా మట్టి డంపింగ్‌కు ఎలా అనుమతిస్తాయో అధికారులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మట్టి కుప్పల కారణంగా ఏదైనా ఇల్లు దెబ్బతిన్నా, ప్రాణనష్టం జరిగినా బాధ్యత ఎవరిదని నిలదీశారు. మట్టి డంపింగ్‌ను ప్రశ్నించిన స్థానికులను కొంతమంది వ్యక్తులు పోలీసులమని బెదిరిస్తున్నారని, ప్రశ్నించిన సామాన్య ప్రజలపై పోలీసు కేసులు పెడతామని భయపెడుతున్నారని గంగాధర్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు తమ సమస్యలను ప్రశ్నించే హక్కు ఉందని, వారిని బెదిరించడం కాకుండా అధికారులు సమస్యపై సమాధానం చెప్పాలని అన్నారు.
స్థానిక ఎమ్మార్వోను సంప్రదించినప్పుడు తాత్కాలికంగా మట్టి వేసుకోవడానికి అనుమతి ఇచ్చినట్లు కొంతమంది అధికారులు చెబుతున్నారని పేర్కొన్న ఆయన.. నిజంగా అనుమతి ఇచ్చారా? ఇస్తే ఏ ప్రాతిపదికన ఇచ్చారు? ఎంత కాలానికి అనుమతి ఉంది? వంటి వివరాలను స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతోపాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు గంగాధర్ రెడ్డి తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా మట్టి డంపింగ్‌ను వెంటనే నిలిపివేసి, ఇప్పటికే వేసిన మట్టి కుప్పలను తొలగించాలని కోరారు. అవసరమైతే రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హైడ్రా, ఇరిగేషన్ శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి పూర్తి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. మట్టి ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడికి తరలించాల్సి ఉంది, ఎన్ని ట్రిప్పులు వచ్చాయి, డంపింగ్‌కు ఎలాంటి అనుమతులు ఉన్నాయి అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా మట్టి డంపింగ్ కొనసాగిస్తే స్థానికులతో కలిసి మరింత పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని గంగాధర్ రెడ్డి హెచ్చరించారు. వేసిన మట్టిని పూర్తిగా తొలగించే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అనంతరం అక్కడే ఉన్న ఆర్ఐ ఇంద్రసేన రెడ్డికి స్థానికులతో కలిసి వినతిపత్రం అందజేసి, మట్టి డంపింగ్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసి గోపన్‌పల్లి పరిస్థితిని వివరించి, ఇప్పటికే వేసిన మట్టి కుప్పలను తొలగించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి డంపింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాములు, శ్రీనివాస్, ప్రభాకర్, శేఖర్, ప్రకాష్, సుమన్, శ్రీశైలం, నరసింహ, గిరి, గోవర్ధన్, రవి, నరేష్, శ్రీకాంత్, స్థానిక నేతలు, కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.





