శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): నేతాజీ నగర్ కాలనీలో రహదారి నిర్మాణానికి అనుమతి మంజూరు చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులకు కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. నేతాజీ నగర్ కాలనీలో నివసించే పేద, మధ్యతరగతి కుటుంబాలు నిత్యావసర పనుల కోసం అపర్ణ సరోవర్, ఆసుపత్రి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు గత కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. కాలనీకి వెళ్లే దారిని పూర్తిగా మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

రహదారి సౌకర్యం కల్పించాలని కాలనీ అసోసియేషన్ తరఫున పలుమార్లు జీహెచ్‌ఎంసీ అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించినట్లు బేరి రామచందర్ యాదవ్ తెలిపారు. తమ విజ్ఞప్తిపై అధికారులు సానుకూలంగా స్పందించి రహదారి నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రహదారి పనులను వర్క్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సూపర్‌వైజర్ లక్ష్మణ్‌తో పాటు కాలనీ అసోసియేషన్ సభ్యులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, కే. నరసింహ యాదవ్, అన్నదొర, దశరథ్ నాయక్, గణేష్ నాయక్, బాల్రాజ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. కాలనీ ప్రజలకు రాకపోకలకు దారి కల్పించేందుకు సహకరించిన అధికారులకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బేరి రామచందర్ యాదవ్ పేర్కొన్నారు.





