శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదాపూర్ డివిజన్ గోకుల్ ప్లాట్స్‌లోని డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ కార్యాలయ ఆవరణలో గుండె ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చందానగర్‌లోని ఒమెగా, పీఆర్కే హాస్పిటల్ సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్డియాలజిస్ట్ డాక్టర్ భానుకిరణ్ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ మార్పుల కారణంగా గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. గుండె జబ్బుల కారణంగా ప్రాణనష్టంతోపాటు ఆర్థిక నష్టాలు కూడా సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.

గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంయుక్తంగా 2011 నుంచి ప్రతి ఏడాది సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది డోంట్ మిస్ ఎ బీట్ అనే నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటని, రక్తం ద్వారా ఆక్సిజన్, పోషకాలను శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. మధుమేహం, రక్తపోటు, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, అధిక కొవ్వు పదార్థాలు, మైదాతో తయారైన ఆహారాన్ని అధికంగా తీసుకోవడం వంటి అంశాలు గుండె సంబంధిత సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు.

ఛాతిలో అకస్మాత్తుగా నొప్పి రావడం, నొప్పి మెడ, ఎడమ చేయి, దవడ తదితర ప్రాంతాలకు వ్యాపించడం, మైకం, వికారం, అధికంగా చెమటలు పట్టడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్ భానుకిరణ్ రెడ్డి సూచించారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు గుండె సాధారణం కంటే వేగంగా కొట్టుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మధుమేహం, కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలని, ధూమపానం మానేయాలని సూచించారు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక, వ్యాయామం, యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి శారీరక కార్యకలాపాలు చేయాలని తెలిపారు. ఫాస్ట్‌ఫుడ్, శీతల పానీయాలు, అధిక క్యాలరీల ఆహారాన్ని తగ్గించాలని సూచించారు. తాజా ఆకుకూరలు, సీజనల్ పండ్లు, డ్రైఫ్రూట్స్, మొలకలు, తృణధాన్యాలు, చేపలు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులను సమతుల ఆహారంలో భాగంగా తీసుకోవాలని తెలిపారు. వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని, తగినంత నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
సంవత్సరానికి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడంతోపాటు, వైద్యుల సూచన మేరకు 2డీ ఎకో వంటి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. గుండెపోటు అనుమానం వచ్చినప్పుడు వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలని సూచించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వారికి బీపీ, షుగర్, 2డీ ఎకో పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. కార్యక్రమంలో డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ నిర్వాహకురాలు చావ అరుణ, సిబ్బంది, మహిళలు, కాలనీ వాసులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామిరెడ్డి, బాలాజీ, హాస్పిటల్ ప్రతినిధులు జాకీర్ హుస్సేన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.





